జయసూర్య ఆసక్తికర కామెం‍ట్స్‌

జయసూర్య ఆసక్తికర కామెం‍ట్స్‌

శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం కొనసాగుతోంది. నిత్యవసర ధరలు చుక్కలనంటుతున్నాయి. ఏ వస్తువు కొనాలన్నా వందల్లో, వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై లంకేయులు ఆందోళనలకు దిగారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ప్రస్తుతం లంకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఇదిలా ఉండగా.. ఈ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ తన వంతు సాయం అందిస్తోంది.

ఇప్పటికే భారీ స్థాయిలో బియ్యం, డిజిల్, మందులను శ్రీలంకకు భారత్ సరఫరా చేసింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తమ దేశానికి చేస్తున్న ఈ సాయంపై శ్రీలంక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కష్టకాలంలో తమకు సాయం చేసిందుకు భారత్‌కు, ప్రధాని మోదీకి శ్రీలంక మాజీ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా జయసూర్య మాట్లాడుతూ.. భారత్ ఎల్లప్పుడూ తమ దేశానికి సహాయం చేస్తూనే ఉందని ప్రశంసించారు.

మా పెద్దన్న ఇండియానే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో పాటు ఇతర దేశాల సాయంతోనే సమస్యల నుంచి శ్రీలంక బయటపడుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా స్పందించకుంటే రానున్న రోజుల్లో పెను విపత్తును ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీలంకలో బతకడం అంత ఈజీ కాదని షాకింగ్‌ కామెం‍ట్స్‌ చేశారు. విద్యుత్‌ సరఫరా లేకపోవడం, ఆహార కొరత, పెట్రోల్‌, డీజిల్‌ కొరత వల్ల లంకేయులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని అన్నారు.