అసలు విషయాన్ని చెప్పిన ఎన్టీఆర్‌

junior ntr to bigg boss show season2 on star maa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 1 విజయవంతంగా పూర్తి అయ్యింది. మొదటి సీజన్‌తో స్టార్‌ మాటీవీకి నెం.1 ర్యాంక్‌ వచ్చింది. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌లో స్టార్‌ మాటీవీ రికార్డు స్థాయిలో రేటింగ్‌ను సాధించింది. గతంలో ఏ తెలుగు కార్యక్రమానికి రాని రేటింగ్‌ ఈ షోకు రావడంతో నిర్వాహకులు వెంటనే రెండవ సీజన్‌కు సిద్దం అవుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే రెండవ సీజన్‌కు ఎన్టీఆర్‌ అందుబాటులో ఉండటం లేదని, ఆ కారణంగా నానిని తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే నానితో ఒప్పందం చేసుకుని, వచ్చే మార్చి లేదా ఏప్రిల్‌లో షోను ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాని ఆ వార్తల్లో నిజం లేదని ఎన్టీఆర్‌ తేల్చి చెప్పాడు.

ఎన్టీఆర్‌ తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తాను ‘బిగ్‌బాస్‌ 2’ సీజన్‌కు నో చెప్పినట్లుగా వస్తున్న వార్తలను కొట్టి పారేశాడు. రెండవ సీజన్‌ ఎప్పుడు ఉండేది తెలియదు కాని, ఎప్పుడు ఉన్నా కూడా తాను మాత్రమే హోస్ట్‌గా చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. విశ్వసనీంగా అందుతున్న సమాచారం ప్రకారం రెండు సీజన్‌లకు ఇప్పటికే అగ్రిమెంట్‌ చేసుకున్నారని, ఆ కారణంగా ఎన్టీఆర్‌ ఖచ్చితంగా ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2కు హోస్ట్‌గా వ్యవహరించాల్సిందే అని సమాచారం అందుతుంది.

ఎన్టీఆర్‌ తాజాగా ‘జై లవకుశ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ను దక్కించుకుంది. దాదాపు 150 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను ఈ సినిమా రాబట్టింది. ఇక తర్వాత సినిమాను త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేసేందుకు ఎన్టీఆర్‌ సిద్దం అయ్యాడు. ఆ సినిమా కోసం ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా కనిపించబోతున్నాడు. వచ్చే నెలలో సినిమా పూజా కార్యక్రమం నిర్వహించి వచ్చే ఫిబ్రవరి లేదా మార్చిలో సినిమా చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నారు.