సంక్షేమంలో తెలంగాణ నంబర్‌వన్

kalayanalakshmi cheques distribution

తెలంగాణ ఏర్పాటు తర్వాత వినూత్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందనీ, ప్రతి పేదింటికి కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి కేసీఆర్ పెండ్లికానుకగా కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలను అందిస్తూ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట, హుజూర్‌నగర్, గరిడేపల్లిలో సూర్యాపేట, హుజుర్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులతోపాటు సీఎం సహాయ నిధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ రుణాల చెక్కులను మంత్రి అందజేసి మాట్లాడారు. యేటా రాష్ట్రంలో రూ.45 వేల కోట్లకుపైనే సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ.50 వేల కోట్లకుపైనే పెరగనుందన్నారు. ప్రతి యేటా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై రూ.800 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,146 మందికి రూ.10.48 కోట్ల కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందజేయడంతోపాటు 60 మందికి రూ.18.24 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, 28 మందికి 14 లక్షల బీసీ రుణాల చెక్కులు అందజేశారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆత్మకూర్ ఎస్.మండలానికి చెందిన 25.1 ఎకరాల ఇనాం భూముల పట్టాలు పేద కుటుంబాలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ అమయ్‌కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్‌రావు, ట్రైనీ కలెక్టర్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.