కణం రివ్యూ… తెలుగు బులెట్

Kanam movie review
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నటీనటులు : సాయిపల్లవి,నాగశౌర్య,వెరోనికా
దర్శకత్వం : ఏ ఎల్ విజయ్
వ్యవధి : 101 నిముషాలు
మ్యూజిక్ : సి.శామ్
నిర్మాణం :లైకా ప్రొడక్షన్స్

లైకా ప్రొడ‌క్ష‌న్స్ లాంటి పెద్ద సంస్థ‌, తమిళ పొన్ను సాయిప‌ల్ల‌వి, ఛ‌లో త‌ర్వాత నాగ‌శౌర్య కలబోతలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో క‌ణంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. దియా గా తమిళంలో కణంగా తెలుగులో రానున్న ఈ చిత్రం అంచ‌నాలు అందుకుందా..? లేదా చూద్దాం

కథ :

కృష్ణ (నాగ శౌర్య), తులసి (సాయి పల్లవి) ఇద్దరూ కాలేజీ లో ఉన్నప్పుడే ప్రేమలో పడతారు. అలా ప్రేమలో ఉండగానే తులసి తల్లి అవుతుంది. ఇది తెలుసుకున్న తులసి, కృష్ణ కుటుంబ సభ్యులు తులసికి అబార్షన్ చేయిస్తారు. ఆ తరువాత చదువు పూర్తయ్యి ఇద్దరు జీవితంలో సెటిల్ అయ్యే వరకు ఇద్దరికీ పెళ్లి చెయ్యలేము అని కండిషన్ పెడతారు ఇరు కుటుంబ సభ్యులు. ఐదేళ్ళ తర్వాత పెళ్లి చేసుకొని ఒకటవుతారు కృష్ణ (నాగశౌర్య)-తులసి (సాయిపల్లవి). పెళ్లి అయ్యిందన్న ఆనందం కానీ, ప్రేమించినవాడ్నే పెళ్లాడానన్న సంతోషం కానీ తులసి ముఖంలో కనిపించవు. దానికి కారణం ఏంటని ప్రశ్నించిన కృష్ణకు గతంలో నువ్వు చేసిన తప్పే కారణమని చెబుతుంది తులసి.

ఈ పెళ్లి తరువాత తులసి, కృష్ణ కుటుంబంలో ఒక్కొక్కరు ఆక్సిడెంట్ అయ్యి చనిపోతారు. అందరి మరణాల్లోనూ కామన్ పాయింట్ ఊపిరాడకుండా చనిపోవడం. అసలెందుకని వారు వరుసబెట్టి చనిపోతుంటారు? వారి మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? వాళ్ళిద్దరినీ చంపేది ఎవరో కాదు తులసి కి అబార్షన్ లో పోయిన పాపే. ఆ పాప అసలు వాళ్ళని ఎందుకు చంపుతుంది? ఈ ఆక్సిడెంట్స్ వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకున్న తులసి తరువాత జరిగే ఆక్సిడెంట్ ని ఎలా ఆపింది అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

నటీనటులు :

నటీనటుల విషయానికి వస్తే ముందుగా సాయి పల్లవి గురించి చెప్పాలి తులసి అనే డాక్టర్ గా సాయి పల్లవి చాలా బాగా నటించింది. సాయి పల్లవి సినిమా మొత్తం ఒకే మూడ్ ని క్యారీ చేసింది. సాయి పల్లవి తన కెరీర్ లో ఇలాంటి ఒక పాత్ర లో నటించడం ఇదే తొలిసారయినా దీన్ని ఒక సవాలుగా తీసుకొని తన పాత్రకి న్యాయం చేసింది సాయి పల్లవి. ఆమె కెరియర్‌లో ఇదో ఛాలెంజింగ్ రోల్. ప్రతి సన్నివేశంలో తన నటనను అభినందించి తీరాల్సిందే. అంతలా ఆమె ఆడియన్స్‌ను కళ్ళు తిప్పలేనంతగా నటించింది. ఇక ఎమోషనల్ సీన్స్‌లో వయసుకు మించి నటించింది. క్లైమాక్స్ సీన్స్‌లో ఆమె నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది.

ఇక నాగ శౌర్య విషయానికి వస్తే సాయి పల్లవి నటన ముందు తేలిపోయాడనే చెప్పాలి. కొన్ని చోట్ల సరైన హావభావాలు ప్రదర్శించడానికి ఇబ్బంది పడ్డాడు. ఉన్నంతలో తన లుక్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సాయి పల్లవి తరువాత ఆ రేంజ్‌లో తన నటనతో మెప్పించింది బేబీ వెరోనికా. సినిమాలో ఆమెకు ఎక్కువగా డైలాగ్స్ లేకపోవడంతో కళ్ళతోనే చక్కటి హావభావాలు పలికించింది. తన తల్లిని ముట్టుకోవాలని ఆరాటపడే కూతురిగా చక్కటి అభినయాన్ని కనబరిచింది. పతాక సన్నివేశాలలో సాయిపల్లవి, వెరోనికాల మధ్య నడిచే సన్నివేశాలు కంట తడి పెట్టించక మానవు. ప్రియదర్శి తన పాత్ర ద్వారా కామెడీ పండించే ప్రయత్నం చేసినప్పటికీ ఎబ్బెట్టుగా ఉంటుంది.

సాంకేతిక వర్గం :

రన్ టైం తక్కువగా ఉన్న ఈ సినిమాలో ద్వితీయార్థం, క్లైమాక్స్ బాగా ఆకట్టుకోగా మొదటి అర్ధభాగం రొటీన్ గా నడించింది. కథలో ముఖ్యమైన తల్లి, బిడ్డల పాత్రల మధ్యన ఎమోషన్ ను కూడ ఇంకాస్త బిల్డప్ చేసి ఉండాల్సింది. సామ్ సి.ఎస్ అందించిన పాటల కంటే నేపధ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ద్వారా సినిమాను బాగా ఎలివేట్ చేయగలిగాడు. ఎమోషనల్ సీన్స్‌లో వచ్చే ఆర్.ఆర్ హైలైట్‌గా నిలిచింది. నీరవ్ షా సినిమాటోగ్రఫీ సినిమా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. సిజి వర్క్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : ”కణం”, ఆలోచింపచేసే చిత్రం.
రేటింగ్ : 2.25 / 5