ఎవరి ప్రోద్బలం లేకుండానే ఉన్నత శిఖరాలకు చేరుకున్న ‌కంగనా

ఎవరి ప్రోద్బలం లేకుండానే ఉన్నత శిఖరాలకు చేరుకున్న ‌కంగనా

బాలీవుడ్‌లో బంధుప్రీతికి వ్యతిరేకంగా గళమెత్తిన క్వీన్‌ కంగనా రనౌత్‌కు సీనియర్‌ నటుడు, మాజీ ఎంపీ శత్రుఘ్న సిన్హా బాసటగా నిలిచారు. ఎలాంటి అండదండలు లేకుండా నటిగా ఎదిగిన కంగనాపై ఈర్ష్య, అసూయలతోనే ఆమెను కొంతమంది విమర్శిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య నేపథ్యంలో బీ-టౌన్‌లో అవుట్‌సైడర్లపై వేధింపులు, నెపోటిజం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంగనా రనౌత్‌ బాలీవుడ్‌ పెద్దలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కావాలనే టార్గెట్‌ చేసి, సినిమాలు ఆడకుండా అడ్డుకుని సుశాంత్‌ను బలితీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో కొంతమంది సినీ ప్రముఖులు, అభిమానులు కంగనను సమర్థిస్తుండగా.. మరికొంత మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన శత్రుఘ్న సిన్హా.. ‘‘చాలా మంది కంగనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆమెపై ఉన్న అసూయే ఇందుకు కారణం. మన దయాదాక్షిణ్యాలు, ఆశీర్వాదాలు, మన గ్రూపుల్లో చేరకుండానే తను ఎదిగింది. ఎవరి ప్రోద్బలం లేకుండానే ఉన్నత శిఖరాలకు చేరుకుంది. అందుకే ఆమె విజయం, సాహసాన్ని చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. తమ అండగా లేకుండా ఎదిగినందుకు విసిగెత్తిపోతున్నారు’’అని కంగనాపై ప్రశంసలు కురిపించారు.

అదే విధంగా తమ కాలంలో ‘కాఫీ విత్‌ అర్జున్’‌ వంటి వివాదాలకు దారితీసే కార్యక్రమాలు లేవని, ఓ వ్యక్తిని టార్గెట్‌ చేసి ఇండస్ట్రీ నుంచి పంపేయాలనే రాజకీయాలు కూడా లేవంటూ పరోక్షంగా దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. కాగా స్టార్‌ కిడ్స్‌పై ట్రోల్స్‌కి దిగిన సుశాంత్‌ ఫ్యాన్స్‌ శత్రుఘ్న సిన్హా కుమార్తె, హీరోయిన్‌ సొనాక్షి సిన్హాపై కూడా విరుచుకుపడిన సంగతి తెలిసిందే.