డిప్రెషన్‌తో బాధపడుతున్న కన్నడ నటి

డిప్రెషన్‌తో బాధపడుతున్న కన్నడ నటి

‘‘నేను వెళ్లిపోతున్నా. ఈ ప్రపంచానికి, డిప్రెషన్‌కు గుడ్‌ బై’’ అంటూ కన్నడ నటి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ జయశ్రీ రామయ్య సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు ఆమె అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. అయితే కాసేపటి తర్వాత తన నిర్ణయం మార్చుకున్నట్లు వెల్లడించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కష్టాలకు ఎదురీది నిలబడటంలోనే అసలైన మజా ఉంటుందని, డిప్రెషన్‌ను వీడి ముందుకు సాగాలంటూ కామెంట్ల రూపంలో ఆమెకు ధైర్యం నూరిపోస్తున్నారు. కాగా మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన జయశ్రీ.. ‘‘ఉప్పు హులి ఖరా’’అనే సినిమాతో వెండితెరకు పరిచయమ్యారు. ఆ తర్వాత కన్నడ బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు.

ఇక లాక్‌డౌన్‌ నేపథ్యంలో అవకాశాలు లేకపోవడంతో ఆమె ఇటీవలే తన స్వస్థలానికి వెళ్లిన జయశ్రీ.. తాను డిప్రెషన్‌లో కూరుకుపోయానని, ఇకపై ప్రపంచాన్ని విడిచి వెళ్తున్నట్లు ఫేస్‌బుక్‌లో బుధవారం ఉదయం పోస్టు పెట్టారు. దీంతో ఆమె ఏ అఘాయిత్యానికి పాల్పడుతోందనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. కఠిన నిర్ణయం తీసుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కాసేపటి తర్వాత తన పోస్టును డిలీట్‌ చేసిన జయశ్రీ…‘‘నేను బాగున్నాను. సురక్షితంగా ఉన్నాను!! లవ్‌ యూ ఆల్‌’’ అంటూ పేర్కొన్నారు.

కాగా జయశ్రీ గత కొన్నాళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారని ఆమె స్నేహితురాలు, నటి అద్వైతీ శెట్టి తెలిపారు. కుటుంబ సమస్యలు, కెరీర్‌ పరంగా ఎదురవుతున్న ఇబ్బందులతో సతమవుతోందని చెప్పుకొచ్చారు. ఇంటికి వెళ్లినప్పటి నుంచి తమతో కాంటాక్ట్‌లో లేదని, ఫోన్‌ నెంబర్‌ తరచుగా మార్చడంతో మాట్లాడే వీల్లేకుండా పోయిందని పేర్కొన్నారు. బుధవారం నాటి పోస్టుతో తాను కంగారు పడ్డానని, ఈ విషయం గురించి తనతో తప్పకుండా చర్చించి, స్నేహితురాలి బాధను పంచుకుంటానని చెప్పుకొచ్చారు.