కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు

కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు

టీ20 ప్రపంచకప్‌-2021 నుంచి టీమిండియా నిష్క్రమించడంపై క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ స్పందించాడు. భారత క్రికెటర్లు, బీసీసీఐలను టార్గెట్‌ చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఐపీఎలే ముఖ్యమనుకున్న వాళ్లు దేశం కోసం ఏం ఆడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇచ్చి, దేశాన్ని విస్మరించే వాళ్లకు ఏం చెప్పలేమంటూ అసహనం వ్యక్తం చేశాడు.

భారత క్రికెటర్లు దేశం తరఫున ఆడటాన్ని గౌరవంగా భావించాలంటూ హితవు పలికాడు. టీమిండియాకు ఆడాలనుకునేవాళ్లు ఐపీఎల్‌ లాంటి టోర్నీలు ఆడకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పేలవ ప్రదర్శనకు తీరిక లేని షెడ్యూలే కారణమని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో కపిల్‌ ఈ మేరకు స్పందించారు.

ఇదిలా ఉంటే, పొట్టి ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాభవాలను ఎదుర్కొన్న టీమిండియా.. ఆ తర్వాత అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్‌లపై ఘన విజయాలు సాధించినప్పటికీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.

సెమీస్ చేరాలంట అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో అఫ్గాన్ ఏదైనా అద్భుతం చేయాలని అంతా ఆశించినప్పటికీ, అలాంటిదేమీ జరగకపోవడంతో టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2012 టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఐసీసీ ఈవెంట్‌లో టీమిండియా తొలిసారి నాకౌట్‌ దశకు చేరకపోవడంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు టీమిండియాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.