కథలో రాజకుమారి… తెలుగు బులెట్ రివ్యూ

kathalo rajakumari Movie review

Posted September 15, 2017 at 13:39 

నటీనటులు :   నారా రోహిత్ , నాగ శౌర్య ,  నమిత  ప్రమోద్ , అవసరాల  శ్రీనివాస్ 
నిర్మాత :     సుధాకర్ రెడ్డి బీరం , నర్రా సౌందర్య , ప్రశాంతి , కృష్ణ విజయ్  
దర్శకత్వం :    మహేష్ సూరపనేని 
మ్యూజిక్ డైరెక్టర్ :  ఇళయరాజా , విశాల్ చంద్రశేఖర్ 
ఎడిటర్ :      కార్తీక్ శ్రీనివాస్ 
సినిమాటోగ్రఫీ : నరేష్  కంచరానా 

తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్, ఫెయిల్యూర్, ఇమేజ్ వంటి అంశాల్ని పక్కనబెట్టి కొత్త కధలు, కొత్త దర్శకులు, కొత్త తరహా సినిమాలు చేయడానికి నిరంతరం తపనపడే హీరో నారా రోహిత్. ఆయన సినిమాలు కొన్ని ప్లాప్ అయివుండొచ్చు కానీ ఏదో ఒకటి ట్రై చేయకుండా మరీ నిరాశ పరిచిన సందర్భాలు వుండవు. ఇప్పుడు అదే కోవలో నారా రోహిత్ మరో కొత్త దర్శకుడు మహేష్ సూరపనేని కి ఛాన్స్ ఇస్తూ తీసిన సినిమా కధలో రాజకుమారి. టైటిల్ కూడా బాగా ఇంటరెస్టింగ్ గా ఉన్న ఈ సినిమా అంచనాలకు తగ్గట్టు వుందో,లేదో చూద్దామా…

కథ…

అర్జున్ చక్రవర్తి ( నారా రోహిత్ ) తెలుగు సినీ పరిశ్రమలో తిరుగు లేని విలన్. అతనికి ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా, అంతకు మించి ఇమేజ్ ఉంటుంది. బయట కూడా అతని ప్రవర్తన బాగా మొరటుగా ఉంటుంది. నిజ జీవితంలో కూడా విలన్ ఏమో అన్నంత ఫీలింగ్ కలుగుతుంది. అదే ఇండస్ట్రీలో హీరో నాగసౌర్య. అతనికి అర్జున్ ప్రవర్తన చిరాకు పుట్టిస్తుంది. అయితే ఓ ఆక్సిడెంట్ అర్జున్ హవా కి బ్రేక్ వేస్తుంది. ఆ ప్రమాదం తర్వాత అర్జున్ ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. మంచి మనిషిగా మారుతుంటాడు. అదే టైం లో అతనిలోని విలన్ కూడా చప్పబడిపోతాడు. దాని ఎఫెక్ట్ అతని పాత్రల మీద పడుతుంది.దీంతో అర్జున్ కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది. దాన్ని కాపాడుకోడానికి ఓ వ్యక్తిత్వ వికాస నిపుణుడిని ఆశ్రయిస్తాడు అర్జున్.

ఆ నిపుణుడు అర్జున్ లోని పాత దూకుడు , విలనీ బయటకు రావాలంటే ఓ శత్రువు మీద పగ తీర్చుకోమని సలహా ఇస్తాడు. దీంతో అతను ఎక్కడో ఓ పల్లెటూళ్ళో ఉంటున్న తన చిన్ననాటి స్నేహితురాలు కమ్ శత్రువు సీత దగ్గరికి వెళతాడు. పైకి ఆమెతో మంచిగా ఉంటూనే ఆమెకి చెడు చేస్తుంటాడు. ఈ అర్జున్ పన్నాగం నుంచి సీత ఎలా బయటపడింది? అసలు బాల్యంలో వారి మధ్య ఏమి జరిగింది ? అర్జున్ మారాడా? వంటి ప్రశ్నలకు సమాధానమే కధలో రాజకుమారి సినిమా.

విశ్లేషణ…

ఓ కధగా చూస్తే కధలో రాజకుమారి చాలా ఫ్రెష్ స్క్రిప్ట్. సినీ నేపథ్యంలో సాగే సినిమాలు తెలుగు తెర మీద చాలా తక్కువ. ఒకవేళ ఈ నేపధ్యాన్ని వాడుకున్నా అది హీరోయిజం కోసమో లేక కామెడీ కోసమో వాడుకునే వాళ్ళు. కానీ ఇలాంటి కధకి సినీ నేపధ్యాన్ని వాడుకోవాలన్న ఆలోచన చాలా బాగుంది. అయితే కధలో ఉన్న ఇంటెన్సిటీ కి తగ్గ కధనం, సీన్స్, డైలాగ్స్ రాసుకోవడంలో దర్శకుడు మహేష్ దారి తప్పాడేమో అనిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని మెరుపులు ఉన్నప్పటికీ మొత్తంగా చూస్తే కధలో రాజకుమారి ఓ మంచి ప్రయత్నమే కానీ సక్సెస్ ఫుల్ ప్రయత్నం కాదు అనిపిస్తోంది.
ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నారా రోహిత్ గురించి. ఆయన ఈ పాత్ర కోసం స్పెషల్ ఎఫర్ట్ పెట్టాడు. నటన, ఫిజిక్ పరంగాను ఎన్నో మార్పులు వచ్చాయి. ఇదే కథని ఇంకో సీనియర్ దర్శకుడు డీల్ చేసినట్టు అయితే రోహిత్ కోరుకున్న బ్రేక్ కచ్చితంగా వచ్చి ఉండేది. ఇక ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్.కానీ మిస్ యూజ్ అయిందేమో.

ప్లస్ పాయింట్స్ …

కథ
హీరో నారా రోహిత్
ఇళయరాజా నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్స్ …

కధనం
ఫ్లాట్ న్యారేషన్
దర్శకత్వం

తెలుగు బులెట్ పంచ్ లైన్ … “కధలో రాజకుమారి ” కధనం దాకా వస్తే బాగుండేది.
తెలుగు బులెట్ రేటింగ్… 2 . 5 /5 .

SHARE