నాన్న‌గారు అలా మాట్లాడ‌రు…స్లిప్ ఆఫ్ ద టంగ్

Kavitha Clarifies Over KCR's Comments On PM Modi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రైతుల స‌మ‌స్య‌ల‌పై మాట్లాడుతున్న సంద‌ర్భంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏక‌వ‌చ‌నంతో సంబోధించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేంద్ర‌ప్ర‌భుత్వంపైనా, మోడీ పైనా రాజ‌కీయంగా వ్య‌తిరేక అభిప్రాయం ఉన్న‌ప్ప‌టికీ…కేసీఆర్ ఏక‌వ‌చ‌నంతో సంబోధించ‌డం స‌రైనది కాద‌ని టీఆర్ ఎస్ నేత‌లు సైతం ఆంగీక‌రిస్తున్నారు. కేసీఆర్ తీరుపై బీజేపీ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ కుమార్తె, ఎంపీ క‌విత స్పందించారు.

ప్ర‌ధాని మోడీని అవ‌మానించే ఉద్దేశం కేసీఆర్ కు ఏ కోశానా లేద‌ని, కేసీఆర్ ది అలాంటి సంకుచిత స్వ‌భావం కాద‌ని ఆమె అన్నారు. కేసీఆర్ కావాల‌ని అలా అన‌లేద‌ని, పొర‌పాటున ఫ్లోలో అలా వ‌చ్చేసింద‌ని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. చిన్న పొర‌పాటును బీజేపీ నేత‌లు పెద్ద‌ది చేయాల‌నుకోవ‌డం స‌రికాద‌న్నారు. రైతుల ప‌ట్ల ఆవేద‌న‌తోనే కేసీఆర్ కాస్త క‌టువుగా మాట్లాడార‌న్నారు. నాన్న‌గారు అలా మాట్లాడ‌తార‌ని అనుకోను. స్లిప్ ఆఫ్ ద టంగ్ అయిఉంటుంది అని క‌విత వ్యాఖ్యానించారు. విభ‌జ‌న చ‌ట్టంలోని ప్ర‌తిహామీని అమ‌లు చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. పార్ల‌మెంట్ వేదిక‌గా తెలంగాణ హ‌క్కుల కోసం పోరాడేందుకు టీఆర్ ఎస్ ఎప్పుడూ సిద్దంగా ఉంటుంద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా విష‌యంలో 2014 నుంచే తాము మ‌ద్ద‌తిస్తున్నవిష‌యాన్ని క‌విత గుర్తుచేశారు.