తెలంగాణ లోను కుల ప్రభావం పెరిగిందా?.

KCR caste politics in Telangana for 2019 elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణ రాజకీయాల్లో కుల ప్రభావం చాలా తక్కువ. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడా కుల ప్రభావం పెరుగుతున్నట్టే అనిపిస్తోంది .తెలంగాణ సీఎం గా కెసిఆర్ ఆవిర్భవించాక రెడ్ల రాజకీయ ఆధిపత్యానికి దెబ్బ తగిలింది. నక్సల్ ఉద్యమంతో దెబ్బతిన్న వెలమల ఆధిపత్యానికి తిరిగి బీజం పడింది. నిజానికి 2014 ఎన్నికల టైం లో తెలంగాణ అన్న మాట తప్ప అక్కడ ఎన్నికల్లో ఇంకో మాట పనిచేయలేదు. అయితే ఆ వేడి తగ్గాక తెలంగాణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పులు వస్తున్నాయి. తెలంగాణ ఇచ్చేందుకు ఆంధ్రాలో పార్టీని భూస్థాపితం చేసుకున్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా తెలంగాణాలో జెండా ఎగురవేయాలని భావిస్తోంది. అటు టీడీపీ కూడా దెబ్బతినడంతో ఓట్ల చీలిక తగ్గి కాంగ్రెస్ లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పోటీ తెరాస, కాంగ్రెస్ మధ్య ముఖాముఖీ అని తేలడంతో మిగిలిన శక్తుల మద్దతు కూడగట్టుకోవడం ముఖ్యంగా మారింది. ఈ క్రమంలో రెండు పార్టీలకి తెలంగాణ లో పెద్ద సంఖ్యలో ఉండటమే కాకుండా ఆర్ధిక బలం వున్న కమ్ముల మీద పడింది. అయితే ముందుగా పాచిక వేయడంలో కెసిఆర్ సక్సెస్ అయ్యారు.

2019 ఎన్నికల్లో తెరాస ని మళ్లీ గెలిపించడానికి కెసిఆర్ ముందుగానే వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఉద్యమ సమయంలో కెసిఆర్, తెరాస వ్యాఖ్యలు ఆంధ్ర ప్రదేశ్ లో మరీ ముఖ్యంగా కమ్మ వర్గంలో ఆవేదనకు దారి తీశాయి. అందువల్ల వాళ్ళు తెరాస వైపు చూడరని, సెటిలర్స్ కోటాలో వారిని కాంగ్రెస్ దగ్గరికి తీయొచ్చని కెసిఆర్ సందేహించారు. అందుకే ఓ మెట్టు దిగి అనంత వెళ్లి పరిటాల వారింటి పెళ్లితో పాటు రాజకీయంగా కమ్మ వర్గానికి గాలం వేయడంలో సక్సెస్ అయ్యారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఆ వర్గం ఓట్లని ఆశించడంతో పాటు వారి వ్యాపార ప్రయోజనాలకు భంగం కలగదన్న భరోసా ఇవ్వగలిగారు. ఈ పరిణామం తో అలెర్ట్ అయిన కాంగ్రెస్ వెలమ, కమ్మ కాంబినేషన్ ని బూచిగా చూపి తెలంగాణాలో రెడ్లని ఏకతాటిపైకి తెచ్చేందుకు ట్రై చేస్తోంది. మొత్తానికి ఆంధ్రతో పోల్చుకుంటే కుల రాజకీయాలు తక్కువని చెప్పుకునే తెలంగాణలోనూ ఈసారి కుల ప్రభావం పెరిగిందనే చెప్పుకోవాలి.