ఆగస్టుకల్లా వ్యాక్సిన్ రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేసిన కేసీఆర్

ఆగస్టుకల్లా వ్యాక్సిన్ రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేసిన కేసీఆర్

మామూలుగా అయితే ఓ కొత్త వ్యాధికి వ్యాక్సిన్ కనుక్కోవడానికి నాలుగైదేళ్ల దాకా పట్టొచ్చని అంటారు. కానీ కరోనా ప్రభావం అసాధారణంగా ఉండటం, దీని వల్ల ప్రపంచమే స్తంభించిపోవడంతో పరిశోధనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. అలాగే వివిధ దశల్లో అనుమతులు కూడా వేగంగా ఇచ్చేస్తున్నారు. దీంతో తక్కువ సమయంలో వ్యాక్సిన్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మంచి న్యూస్ చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చేందుకు పలు ఫార్మాసూటికల్ కంపెనీల అధినేతలు తనను కలిశారని. శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డితో పాటు భారత్ బయోటెక్, మరో సంస్థ ప్రతినిధులు కూడా తనతో వైరస్ వ్యాప్తి, వ్యాక్సిన్ సంబంధిత పరిశోధనలపై తనతో మాట్లాడారని.. ఆగస్టుకల్లా వ్యాక్సిన్ రావొచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారని కేసీఆర్ వెల్లడించారు.

వరప్రసాద్ రెడ్డి అయితే ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో కరోనా వ్యాక్సిన్ రావడానికి కొన్నేళ్లు పడుతుందనే అన్నారు. తమ సంస్థ అయితే ఈ వ్యాక్సిన్ కోసం పరిశోధనలేమీ చేయట్లేదన్నారు. ఐతే భారత్ బయోటెక్ సీఈవో అయిన రేచస్ వీరేంద్రనాథ్ మాత్రం తమ సంస్థలో పరిశోధనలు ఉద్ధృతంగా సాగుతున్నట్లు చెప్పారు.

ఐతే కొత్త వ్యాధులకు మందు కనుగొనే విషయంలో భారత్‌కు అంత గొప్ప రికార్డేమీ లేదు. మనవాళ్లు కనుగొనే లోపు అమెరికా, ఐరోపా దేశాల్లో ఏవో ఒకటి ఆ పని పూర్తి చేస్తాయని భావిస్తున్నారు. ఏదేమైనా ఈ ఏడాది చివర్లోపు కరోనాకు మందు వస్తుందనే అంచనా వేస్తున్నారు.