రికార్డులపై కన్నేసిన కోహ్లి

రికార్డులపై కన్నేసిన కోహ్లి

దక్షిణాఫ్రికాతో రేపటి నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లిని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ విజయాన్నందించిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కడంతో పాటు టెస్ట్‌ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఆసీస్‌ దిగ్గజ కెప్టెన్‌ స్టీవ్‌ వా సరసన నిలుస్తాడు. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 40 టెస్ట్‌ విజయాలున్నాయి.

ఇక వ్యక్తిగత రికార్డుల విషయానికొస్తే.. వాండరర్స్‌లో కోహ్లి తానాడిన రెండు మ్యాచ్‌ల్లో 310 పరుగులు చేయగా.. న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు జాన్‌ రీడ్‌ 316 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. రేపటి మ్యాచ్‌లో విరాట్‌ మరో ఏడు పరుగులు చేస్తే రీడ్‌ రికార్డును బద్దలు కొడతాడు. 2013లో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టిన ఈ రన్‌ మెషీన్‌.. 2018 పర్యటనలో సైతం రాణించాడు.

దీంతో పాటు ప్రస్తుత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరిట ఉన్న మరో రికార్డుపై సైతం కోహ్లి కన్నేశాడు. దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ద్రవిడ్‌ రెండో స్థానంలో ఉండగా.. కోహ్లి మరో 14 పరుగులు చేసి ఆ స్థానాన్ని ఆక్రమించాలని భావిస్తున్నాడు. ఈ జాబితాలో దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. కాగా, సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా భారీ విజయాన్ని సాధించి, మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే.