అంతా కోహ్లీ ఘనతే

అంతా కోహ్లీ ఘనతే

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ డాషింగ్‌ ఓపెనర్‌, రెండో దశ ఐపీఎల్‌-2021 బ్యాటింగ్‌ సెన్సేషన్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ను తొలి మ్యాచ్‌ తర్వాతే అదృష్టం వరించింది. ఆర్సీబీతో మ్యాచ్‌ అనంతరం ఆ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని కలవడమే కాకుండా అతనితో ముచ్చటించే అవకాశం అయ్యర్‌కు దక్కింది. ఈ మ్యాచ్‌లో 27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అయ్యర్‌ను మ్యాచ్‌ అనంతరం సహచర ఆటగాడు హర్భజన్‌ సింగ్‌.. విరాట్‌ కోహ్లికి పరిచయం చేశాడు.

తొలి మ్యాచ్‌లోనే అయ్యర్‌ ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన భజ్జీ.. కోహ్లికి పరిచయం చేయించడమే కాకుండా, అయ్యర్‌ కోసం కొంచెం సమయం కేటాయించి అతనికి బ్యాటింగ్‌ సలహాలు ఇవ్వాలని కోహ్లిని కోరాడు. ఈ విషయాన్ని అయ్యర్‌ వ్యక్తిగత కోచ్‌ దినేశ్‌ శర్మ వెల్లడించాడు. అయ్యర్‌ను భజ్జీ ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడని.. భజ్జీతో పాటు మెక్‌కలమ్‌ కూడా అయ్యర్‌కు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు అండగా నిలుస్తున్నారన్నాడు. కోహ్లితో స్వల్ప సమయ భేటీలోనే అయ్యర్‌ చాలా విషయాలు నేర్చుకున్నాడని, అవి ముంబైతో మ్యాచ్‌ సందర్భంగా ఉపయోగపడ్డాయని పేర్కొన్నాడు.

ఈ విషయాలన్నీ అయ్యరే స్వయంగా ఫోన్‌ చేసి తనతో షేర్‌ చేసుకున్నాడని దినేశ్‌ శర్మ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే, ఆర్సీబీతో తొలి మ్యాచ్‌లో అజేయమైన 41 పరుగుల అనంతరం ముంబైతో జరిగిన రెండో మ్యాచ్‌లో సైతం వెంకటేశ్‌ అయ్యర్‌ చెలరేగాడు. నిన్న జరిగిన ఈ మ్యాచ్‌లో 30 బంతులను ఎదుర్కొన్న అయ్యర్‌.. 4 ఫోర్లు, 3 సిక్సర్లు సాయంతో 53 పరుగులు సాధించి బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ముంబై నిర్ధేశించిన 156 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో అయ్యర్‌ సహా వన్‌ డౌన్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి చెలరేగి ఆడటంతో కేకేఆర్‌ జట్టు 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.