కోమ‌టిరెడ్డి దెబ్బకి స్వామిగౌడ్ కంటికి గాయం

komatireddy throws Headset in TS Assembly Swamy Goud eye Injured

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా అసెంబ్లీలో అవాంఛ‌నీయ ఘ‌ట‌న చోటుచేసుకుంది. స‌మావేశాల తొలిరోజు సంప్ర‌దాయం ప్ర‌కారం ఉభ‌య‌స‌భ‌ల‌నుద్దేశించి గ‌వ‌ర్న‌ర్ న‌రసింహ‌న్ ప్ర‌సంగించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ స‌భ్యులు ప్ర‌య‌త్నించ‌డంతో అసెంబ్లీలో తీవ్ర గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్ర‌సంగ ప్రతుల‌ను చింపివేస్తూ, నినాదాల‌తో పోడియంలోకి దూసుకువ‌చ్చారు. మార్ష‌ల్స్ అడ్డుకుంటున్నా వారిని తోసుకుంటూ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించారు. కాంగ్రెస్ ఆందోళ‌న‌ను ప‌ట్టించుకోకుండా గ‌వ‌ర్న‌ర్ త‌న ప్రసంగాన్ని కొన‌సాగించారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్న వ‌స్తువుల‌ను గ‌వ‌ర్న‌ర్ చైర్ పైకి విసిరేశారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డితో పాటు ఇత‌ర ఎమ్మెల్యేలు మైక్ లు విరిచేసి, హెట్ సెట్లు తీసి పోడియం వైపు విసిరేశారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి విసిరిన ఒక హెడ్ సెట్ గ‌వ‌ర్న‌ర్ ప‌క్క‌నే ఉన్న మండ‌లి చైర్మ‌న్ స్వామిగౌడ్ కంటికి బ‌లంగా తగిలింది. దీంతో ఆయ‌న్ను హుటాహుటిన మెహ‌దీ ప‌ట్నంలోని స‌రోజినీ దేవి కంటి ఆస్ప‌త్రికి త‌రలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ దాడిని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న కేసీఆర్ ప్ర‌భుత్వం అసెంబ్లీ స‌మావేశాలు ముగిసేవ‌ర‌కు కోమ‌టిరెడ్డిని స‌స్పెండ్ చేయాల‌ని భావిస్తోంది. అటు కాంగ్రెస్ స‌భ్యుల నిర‌స‌న‌ల మ‌ధ్యే ప్ర‌సంగాన్ని కొన‌సాగించిన గ‌వ‌ర్న‌ర్ తెలంగాణ ప్ర‌భుత్వం ల‌క్ష్యాల‌ను వివ‌రించారు. ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌లు నెర‌వేర్చేందుకు ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌ని, బంగారు తెలంగాణ దిశ‌గా అడుగులు వేస్తోంద‌ని గ‌వ‌ర్న‌ర్ చెప్పారు. రైతుల‌కు గోదావ‌రి, కృష్ణా జ‌లాలు అందించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని తెలిపారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నులు యుద్ధ ప్రాతిప‌దిక‌న జ‌రుగుతున్నాయ‌ని, మిష‌న్ కాక‌తీయ ద్వారా చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, మిష‌న్ భ‌గీర‌థ ద్వారా గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు స్వ‌చ్ఛ‌మైన తాగునీరు అందిస్తామ‌ని వివ‌రించారు. ర‌వాణా రంగానికి ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని, గ‌తేడాది హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రారంభ‌మ‌యింద‌ని, పీపీపీ ప‌ద్ధ‌తిలో చేప‌ట్టిన ఈ ప్రాజెక్ట్ మొద‌టి ద‌శ‌లో భాగంగా 30 కిలోమీట‌ర్ల మార్గం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింద‌ని తెలిపారు.