తెలంగాణ మ‌హిళా యూనివ‌ర్శిటీగా కోఠి ఉమెన్స్ కాలేజ్

Koti Womens College As Telangana Women's University In Telanagna
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉన్న ఏకైక మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం ప‌ద్మావ‌తి యూనివ‌ర్శిటీ విభ‌జ‌న‌లో ఏపీకి వెళ్లిపోవ‌డంతో… తెలంగాణ‌లో మ‌హిళా యూనివ‌ర్శిటీ లేకుండా పోయింది. ఈ లోటును హైద‌రాబాద్ లోని కోఠి ఉమెన్స్ కాలేజీ తీర్చ‌నుంది. దాదాపు 40 ఎక‌రాల్లో విస్త‌రించి ఉన్న కోఠి ఉమెన్స్ కాలేజ్ ను విశ్వ‌విద్యాల‌యంగా మార్చేందుకు అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తులున్నాయ‌ని ఉప‌ముఖ్య‌మంత్రి, విద్యాశాఖ మంత్రి క‌డియం శ్రీహ‌రి అభిప్రాయ‌ప‌డ్డారు. కోఠి ఉమెన్స్ కాలేజీలో ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించిన క‌డియం కాలేజ్ ప‌రిస‌రాల‌ను, భ‌వ‌నాల‌ను, వ‌స‌తుల‌ను ప‌రిశీలించారు. బోధ‌నాతీరు, విద్యావిధానంపై విద్యార్థుల‌ను అడిగి తెలుసుకున్నారు.

హైద‌రాబాద్ న‌డిబొడ్డున్న ఉన్న ఈ కాలేజ్ లో బోధ‌నావ‌స‌తులు బాగున్నాయ‌ని, కాలేజ్ వాతావర‌ణం విద్యార్థుల‌కు అనుగుణంగా ఉంద‌ని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులు ఈ కాలేజ్ లో ఉన్నార‌ని, వారితో పాటు విదేశాల‌కు చెందిన చాలామంది విద్యార్థులు కూడా చ‌దువుతున్నార‌ని, మొత్తం 42 యూజీ, పీజీ కోర్సులు న‌డుస్తున్నాయ‌ని, ఒక్క ప‌రిశోధ‌న మాత్ర‌మే లేద‌ని, విశ్వ‌విద్యాల‌యంగా మారితే ప‌రిశోధ‌న కూడా ప్రారంభ‌మ‌వుతుంద‌ని వివ‌రించారు. ఇక్క‌డ మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం ప్రారంభించ‌డానికి కావల్సిన మౌలిక‌వ‌స‌తులు, స‌దుపాయాల‌పై నివేదిక ఇవ్వ‌మ‌ని అధికారుల‌ను ఆదేశించిన‌ట్టు చెప్పారు. కాలేజ్ ను యూనివ‌ర్శిటీగా మార్చే విష‌యం ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, ఆయ‌న ఆమోదం తీసుకుంటామ‌న్నారు. వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచే కోఠి ఉమెన్స్ కాలేజ్ తెలంగాణ మ‌హిళావిశ్వ‌విద్యాల‌యంగా మారుతుంద‌ని తెలిపారు. తెలంగాణ‌లో మ‌హిళా యూనివ‌ర్శిటీ లేని విష‌యాన్ని ఇటీవ‌ల కేంద్ర మాన‌వ‌వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ దృష్టికి తీసుకెళ్లామ‌ని, రాష్ట్ర పున‌ర్ విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం తెలంగాణ‌కు మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటుచేసేందుకు కేంద్రం త‌గిన సాయం చేయాల‌ని కోరిన‌ట్టు క‌డియం తెలియ‌జేశారు.