రథ సప్తమి గురించి కృష్ణుడు ఏం చెప్పాడంటే

Krishna saying about Ratha Saptami

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 మాఘ మాసము , శుక్ల పక్షము , సప్తమి తిథిని రథ సప్తమిగా జరుపుకుంటారు.రథ సప్తమి రోజు సూర్యుడు జన్మించాడని పురాణాలలో పేర్కొనబడినది.కావున దీనినే సూర్య సప్తమి అని అంటారు. ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్ అంటే ఆరోగ్యాన్ని భాస్కరుడు అంటే సూర్యుడు ప్రసాదిస్తాడు కాబట్టి దీనినే ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. 

  సూర్య గ్రహణ పర్వదినంతో సమాన పుణ్యప్రదం రథ సప్తమి :-

సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ
అరుణోదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్
మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటి పుణ్యదా
కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః

 ఈ రోజు అరుణోదయ వేళ స్నానం చేయాలి :-

అరుణోదయము అంటే సూర్యోదయానికి గంటన్నర పూర్వ సమయము. అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలమ్ అని పురాణాల్లో పేర్కొనబడినది కావున అరుణోదయ సమయంలో రేపు జిల్లేడు ఆకులో రేగుపండు తలపై పెట్టుకుని స్నానం చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకం పఠించాలి.

శ్లో :-యద్య జ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు
తస్య రోగం చ శోకం చ సమస్తం హంతు సప్తమీ అంటూ తల స్నానం చేస్తే మహాఫలం లభిస్తుంది. ఏమిటా మహా ఫలమంటే ఆరోగ్యం .కావున ఈ ఒక్క రథ సప్తమి రోజే కాకుండా ప్రతిరోజూ ఇలా స్నానమాచరించడం ఆరోగ్యప్రదం. 

 స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులు తలపై పెట్టుకోవాలి :-

గర్గ మహాముని ప్రబోధము ప్రకారం రథ సప్తమి రోజు స్నానమాచరించేటప్పుడు తలపై 7 జిల్లేడు ఆకులను ఉంచుకోవాలి.జిల్లేడుకు సంస్కృతములో అర్క అని పేరు.సూర్యుడి కూడా అర్కః అని పేరు.కావున సూర్యుడికి అర్క పత్రము అనగా జిల్లేడు పత్రము మిగుల ప్రీతి. 

 సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి :-

మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటి పుణ్యదా. … రథ సప్తమి రోజు నదీ స్నానము విశేషం.స్నానమాచరించి సూర్యుని వైపు ముఖం చేసి అర్ఘ్యము వదిలితే కోట్ల రేట్ల పుణ్యం లభిస్తుంది.సూర్యగ్రహణం రోజు ఎలా స్నాన , జపదానాదులు చేస్తే పుణ్యఫలం లభిస్తుందో తత్ సమానమైన పుణ్యం రథ సప్తమి రోజు చేసే స్నాన-దాన-జపాదుల వలన వస్తుంది. 

 ఈ రోజున ఆదిత్య హృదయం పారాయణం విశేషం :-

రథ సప్తమి రోజు విధిగా స్నానమాచరించి ఆదిత్య హృదయంను పారాయణం చేయడం వలన కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. 

 ఈ వస్తువులు దానం చేయండి :-

సూర్యుడికి ఎరుపు రంగు అత్యంత ప్రీతికరము.ఎరుపు రంగు వస్త్రము , గోధుమలు , బంగారము , ఎరుపు పూలు యథాశక్తి బ్రాహ్మణులకు దానం చేయాలి.అపాత్ర దానం చేయకూడదని గరుణ పురాణంలో పేర్కొనబడినది.కావున సంస్కార హీనులైన బ్రాహ్మణులకు కాకుండా నిత్య దేవతార్చన , యజ్ఞ హోమాలు , జపతపాదులు చేసే యోగ్యమైన బ్రాహ్మణులకు దానం చేయడం వలన దాన ఫలం లభిస్తుంది. 

  రథ సప్తమి వ్రతమును ఆచరించాలి :-

భవిష్యోత్తర పురాణములో రథ సప్తమి వ్రత విధానము విశేషంగా వర్ణించబడినది.
రథ సప్తమి వ్రత కథను శ్రీకృష్ణుడు … ధర్మరాజుకు తెలియజేశాడు.

ప్రణతోస్మి దివాకరమ్

  -శిశ్రీ శిరివరపు శ్రీధర్