రేవంత్ చుట్టూ తెలంగాణ రాజ‌కీయం…

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేర‌డంతో తెలంగాణలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారిపోతున్నాయి. రాజ‌కీయాలు మొత్తం రేవంత్ చుట్టూనే తిరుగుతున్నాయి. పార్టీని వీడుతూ రేవంత్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేయ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్ పై ప‌డింది. రేవంత్ రాజీనామా స్పీక‌ర్ కు చేరిందా… లేదా… చేరితే స్పీక‌ర్ దాన్ని ఆమోదిస్తారా లేదా అన్న‌దానిపై ఇంకా స్ప‌ష్ట‌త లేదు కానీ… కొడంగ‌ల్ కు ఉప ఎన్నిక వ‌చ్చేసిన‌ట్టే అని అధికార‌పార్టీ భావిస్తోంది. టీఆర్ఎస్ పై ఒంటికాలితో లేస్తున్న రేవంత్ ను రాజ‌కీయాల్లో చావు దెబ్బ తీయాల‌ని భావిస్తున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న దృష్టి మొత్తం కొడంగ‌ల్ పైనే కేంద్రీక‌రించారు. ఉప ఎన్నికలో రేవంత్ ను ఓడించ‌డం ద్వారా ఆయ‌న‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ లేకుండా చేయాల‌న్న‌ది కేసీఆర్ ప్లాన్. అందుకోసం ఇప్ప‌టినుంచే పావులు క‌దుపుతున్నారు.రేవంత్ కాంగ్రెస్ లో చేరిన మ‌రుస‌టి రోజే కొడంగ‌ల్ టీడీపీ నేత‌లు కొంద‌రు టీఆర్ఎస లో చేర‌డం వెన‌క కేసీఆర్ హ‌స్తం ఉంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే.

ktr-comments-on-revanth-red

ఈ సంద‌ర్భంగానే తెలంగాణ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డి విష‌యంలో టీఆర్ఎస్ ల‌క్ష్య‌మేమిటో పరోక్షంగా వెల్లడించారు. అన్ని ద‌ర్వాజాలు బందయ్యాయి కాబ‌ట్టే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి పోయాడ‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. టీఆర్ఎస్ లోకి రేవంత్ కు ఎంట్రీ లేద‌ని, తెలంగాణ‌లో టీడీపీ ఖ‌త‌మైపోయింద‌ని, ఇక తెరిచి ఉన్న ఒకే ఒక ద‌ర్వాజా కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ అందుకే ఆ పార్టీలోకి వెళ్లాడ‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లోకి పోయిన తరువాత రేవంత్ పెద్ద పెద్ద మాట‌లు, డైలాగ్స్ చెబుతూ బిల్డ‌ప్ ఇస్తున్నాడ‌ని, త‌మ‌కు కాంగ్రెస్ కొత్త కాద‌నీ, వాళ్ల నాట‌కాలూ కొత్త కాద‌ని కేటీఆర్ అన్నారు. సోనియాగాంధీని దెయ్య‌మ‌ని, రాహుల్ ను ప‌ప్పు అని విమ‌ర్శించిన రేవంత్ కు ఇప్పుడు వాళ్లు దేవ‌తలుగా క‌న‌ప‌డుతున్నార‌ని ఎద్దేవా చేశారు.

తెలంగాణ‌లో టీడీపీని తాను అధికారంలోకి తీసుకువ‌స్తాన‌ని, తానే ముఖ్య‌మంత్రి అవుతాన‌ని కొడంగ‌ల్ లో ఒక‌ప్పుడు రేవంత్ చెప్పుకున్నార‌ని, మ‌రి ఇప్పుడు ఆ మాట‌లు ఏమ‌య్యాయ‌ని కేటీఆర్ ప్రశ్నించారు. చంద్ర‌బాబునాయుడు, లోకేశ్ నాయుడు కూడా ఇదే న‌రుకుడు న‌రికార‌ని, ఇప్పుడేమ‌యింద‌ని, చంద్ర‌బాబు అమ‌రావ‌తికి, రేవంత్ ఢిల్లీకి వెళ్లి ప‌త్తాలేకుండా పోయార‌ని, తెలుగుదేశం పార్టీని చాప‌లాగా మ‌డ‌త‌పెట్టి ఎక్క‌డో పెట్టేశార‌ని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అన్ని సంద‌ర్భాల్లోనూ కేసీఆర్ నాయ‌కత్వాన్ని బ‌ల‌ప‌ర్చేందుకు కొడంగ‌ల్ ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని, ప్ర‌జ‌లంతా కేసీఆర్ వెంట న‌డ‌వాల‌ని మరోమారు తాను విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని చెప్ప‌డం ద్వారా… కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డిని ఓడించాల‌ని ప్ర‌జ‌ల‌కు కేటీఆర్ ప‌రోక్షంగా పిలుపునిచ్చారు.

Revanth reddy posted KTR photo with sathyam Ramalinga raju

కాంగ్రెస్ లో చేర‌క‌ముందు నుంచీ కేసీఆర్ పైనా, ఆయ‌న కుటుంబంపైనా తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న రేవంత్ రెడ్డి కేటీఆర్ తాజా వ్యాఖ్య‌ల‌పైనా త‌న‌దైన శైలిలో స్పందించారు. దొర‌క‌ని దొంగ గుట్టు రట్టు అంటూ కేటీఆర్ కు సంబంధించిన ఓ ఫొటోను రేవంత్ పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో కేటీఆర్, స‌త్యం రామ‌లింగ‌రాజు కుమారుడు తేజారాజు, మ‌లేషియా ప్ర‌ధాని ఉన్నారు. 2016లో జ‌రిగిన అఫీషియ‌ల్ ప్రోగ్రాంలో అన‌ఫీషియ‌ల్ గా తేజారాజు s/o స‌త్యంరామ‌గ‌లింగ‌రాజుతో మ‌లేషియా ప్ర‌ధానిని క‌లిసి మంత‌నాలాడిన స్కాం స్టార్ కేటీఆర్ కు ముందుంది క్రోకోడైల్ ఫెస్టివ‌ల్ అని ఫేస్ బుక్ లో రాశారు రేవంత్. తాను కాంగ్రెస్ లో చేరినందుకు కేటీఆర్ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, స్కాం స్టార్ల‌తో తిరుగుతున్నానని ఆరోప‌ణ‌లుచేస్తున్నార‌ని, ఎవ‌రు స్కాం స్టార్ల‌తో తిరుగుతున్నారో చెప్ప‌డానికి ఈ ఫొటోనే సాక్ష్యం అని రేవంత్ వ్యాఖ్యానించారు. స‌త్యం రామ‌లింగ‌రాజు సుపుత్రుడితో కేటీఆర్ మ‌లేషియాలో ర‌హ‌స్యంగా వెల‌గ‌బెట్టిన నిర్వాకం ఏమిటో చెప్పాల‌ని రేవంత్ రెడ్డి నిల‌దీశారు.

talasani-comments-on-Revant

అటు టీఆర్ ఎస్ కు చెందిన మ‌రో మంత్రి, ఒక‌ప్పుడు టీడీపీలో స‌హ‌చ‌రుడైన త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ కూడా రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేశారు. రేవంత్ రాజీనామా లేఖ ఇంత‌వ‌రకూ స్పీక‌ర్ కు చేర‌నేలేద‌ని, కానీ నేరుగా స్పీక‌ర్ కు రాజీనామా లేఖ ఇచ్చిన‌ట్టు రేవంత్ ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని త‌ల‌సాని ఆరోపించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ చేసేది ఏమీ లేద‌ని, సాక్షాత్తూ రాహుల్ గాంధీ వ‌చ్చికూర్చున్నా… ఆ పార్టీకి ఒరిగేది ఏమీ లేద‌ని ఎద్దేవా చేశారు. రేవంత్ చేరిక‌తో తెలంగాణ కాంగ్రెస్ లో ప‌ద‌వుల కోసం పోట్లాట మొద‌ల‌యింద‌ని వ్యాఖ్యానించారు. పార్టీ మారినా ఎమ్మెల్యే ప‌ద‌వికి తాను రాజీనామా చేయ‌క‌పోవ‌డంపై స్పందిస్తూ గ‌తంలోనే టీడీఎల్పీ టీఆర్ఎస్ లో విలీన‌మ‌యింద‌ని, కాబ‌ట్టి త‌న రాజీనామా లేఖ అప్ర‌స్తుత‌మ‌ని చెప్పుకొచ్చారు. టీఆర్ ఎస్, కాంగ్రెస్ మ‌ధ్య తెలంగాణ లో జ‌రగ‌నున్న యుద్ధానికి కేటీఆర్, రేవంత్ రెడ్డి , త‌ల‌సాని మాట‌లు ఉదాహ‌ర‌ణ‌. ఈ మాట‌ల యుద్ధం ముందు ముందు మ‌రింత ముదర‌నుంది.