లాలూ వివాదాస్పద వ్యాఖ్య‌లు

laloo prasad yadav controversial dialogues

  Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 

మ‌హాకూట‌మితో పొత్తు తెగ‌తెంపులు చేసుకున్న ద‌గ్గ‌ర‌నుంచి బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ పై ఒంటికాలితో లేస్తున్న లాలూ ప్ర‌సాద్ యాద‌వ్…మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో వెలుగుచూసిన టాయిలెట్ల కుంభ‌కోణం గురించి ప్ర‌స్తావిస్తూ లాలూ వివాదాస్ప‌దంగా వ్యాఖ్యానించారు. టాయిలెట్ల కుంభ‌కోణాన్ని త‌న హ‌యాంలో వెలుగుచూసిన దాణా కుంభ‌కోణంతో పోల్చిన లాలూ..అప్ప‌ట్లో అంద‌రూ త‌న‌ను గ‌డ్డి తిన్నాన‌ని ఆడిపోసుకున్నార‌ని, మ‌రి ఇప్పుడు నితీశ్ ఏం తిన్నార‌ని ట్విట్ట‌ర్ లో ప్ర‌శ్నించారు.
నితిశ్ ప్ర‌భుత్వం ఏ క్ష‌ణంలోన‌యినా కుంభ‌కోణాల్లో ఇరుక్కుంటుంద‌ని  జోస్యంచెప్పారు. ప‌ట్నాలో టాయిలెట్ల నిర్మాణం పేరుతో రూ. 13.50 కోట్ల నిధుల‌ను దోచుకున్న‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో లాలూ వివాదాస్ప‌దంగా వ్యాఖ్యానించారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీచేసిన లాలూ ప్ర‌సాద్ నాయ‌క‌త్వంలోని ఆర్జేడీ, నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ..అధికారంలోకి వ‌చ్చి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేశాయి.  అయితే బీజేపీతో చెలిమికి మొగ్గుచూపిన నితీశ్ కుమార్ లాలూ కుమారుడు తేజ‌స్వియాద‌వ్ పై అవినీతి ఆరోప‌ణ‌ల‌ను కార‌ణంగా చూపుతూ మ‌హాకూట‌మి నుంచి తెగ‌తెంపులు చేసుకున్నారు. దీంతో లాలూ ఇప్పుడు జేడీయూతో పాటు బీజేపీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ తో క‌లిసి ఓ వేదిక ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా జేడీయూపైనా, బీజేపీ పైనా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.