ఆలస్యంగా రుతుపవనాలు…అయినా ముందే వర్షాలు

late monsoon

ఈ నెల 1న కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా నేడు కేరళలో అడుగుపెట్టనున్నాయి. రుతుపవనాలు ఇంకా కేరళను తాకకముందే కేరళలో నిన్నటి నుంచి వర్షాలు పడుతున్నాయి. మరోవైపు, రుతుపవనాల రాక నేపథ్యంలో అధికారులు పలు జిల్లాల్లో  రెడ్, ఆరంజ్, యెల్లో అలర్టులను జారీచేశారు. ఆదివారం కేరళ, కర్ణాటక తీర ప్రాంతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడనుందని, దీని ప్రభావం వల్ల రుతుపవనాలు వాయవ్య దిశలో వేగంగా కదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, గతేడాది విపత్తును దృష్టిలో పెట్టుకుని ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు కేరళ విపత్తు నిర్వహణ సంస్థ కార్యదర్శి శేఖర్‌ తెలిపారు. గతేడాది భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోపక్క విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. రుతుపవనాల రాకతో దక్షిణాదిలో భానుడి భగభగలు తగ్గి వాతావరణం చల్లబడగా, ఉత్తరాదిలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణం ఉంది. వేసవి వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉత్తరాదిలోని పలు ప్రాంతాలలో శుక్రవారం కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వారంలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.