ఇన్నాళ్ళకి ఓకే అనేశారు !

Lok Sabha Speaker Sumitra Mahajan approved YCP Mps resignation

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలను రెండున్నర నెలల తర్వాత లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఎట్టకేలకు ఆమోదించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం లోక్‌సభ సచివాలయం బులెటిన్‌ విడుదల చేసింది. బుధవారం నుంచి రాజీనామాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఎంపీలు వరప్రసాద్ రావు, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలు ఈ ఏడాది ఏప్రిల్-6న లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు రాజీనామా లేఖలు సమర్పించిన విషయం విదితమే. ఫైనల్ గా సుమిత్రా మహాజన్ నిన్న వారి రాజీనామాలను ఆమోదించారు. దీంతో ఇక రాజీనామాలు ఆమోదం పొందాయి ఇక ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామన్నారు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి.

లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్… తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీల రాజీనామాలను ఆమోదించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు మోసాలను ప్రజలు గ్రహించారని రాష్ట విభజనకు, ప్రత్యేకహోదా రాకపోవడానికి ముఖ్యకారణం చంద్రబాబే అని ఆరోపించిన మేకపాటి, సొమ్ము చేసుకుందామని ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లినా బాబు ఒక్కసారి కూడా హోదా గురించి అడగలేదని… జగన్ పై కేసులు, నియోజకవర్గాల పెంపుపైనే చంద్రబాబు ప్రధాని మోదీని కలిశారని విమర్శించారు. రెండు నెలల పదిహేను రోజుల తర్వాత మా రాజీనామాలు ఆమోదం పొందాయని ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేసినా ఉపఎన్నికలు వస్తాయనే గ్యారెంటీ లేదని ఉప ఎన్నికలు పెట్టాలా వద్దా ? అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ చేతులో ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు.

అయితే 2014 మే నెలలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెల్లడైనా లెక్కల ప్రకారం 2014 జూన్‌ 4న 16వ లోక్‌సభ పదవీకాలం ప్రారంభమైంది. దీంతో పీపుల్స్ రిప్రేజేంటేటివ్ యాక్ట్-1951లోని 151 (ఏ) సెక్షన్‌ ప్రకారం ఎంపీల పదవీకాలం మరో ఏడాదిలోపు మాత్రమే మిగిలి ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించకూడదు. ఏ స్థానమైనా ఖాళీ అయిన 6 నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాలన్న నిబంధన ఉన్నప్పటికీ అది చివరి ఏడాదికి వర్తించదని అదే చట్టం స్పష్టం చేస్తోంది. జూన్‌ 5 తర్వాత ఖాళీ అయిన ఏ లోక్‌సభ సీటుకూ ఉప ఎన్నిక జరిగే అవకాశం లేనట్లే. ఎంపీల రాజీనామాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి కాబట్టి ఈ స్థానాలకు ఉప ఎన్నికలు జరగవని ఈసీ వర్గాలు కూడా చెప్పేసాయి. దీంతో ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం తాము పదవీత్యాగం చేశామని, ఉప ఎన్నికల్లో తాము ఘనవిజయం సాధించి తీరుతామని ఎంపీలు చెప్పుకున్నా పెద్దగా ఉపయోగం ఉందదు.