ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు

ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు

రాపూరు–చిట్వేలి ఘాట్‌రోడ్డులో రాపూరు నుంచి 6వ కిలోమీటరు వద్ద ఉన్న దట్టమైన అడవిలో పుల్లనీళ్ల చెల్ల (రాళ్ల కాలువ) వద్ద గుర్తు తెలియని యువతి, యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు వీరి మృతదేహాలను గుర్తించారు. మృతదేహాల వద్ద బ్యాగ్, కొన్ని దుస్తులతోపాటు పురుగు మందు డబ్బా ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

మృతదేహాల స్థితి చూస్తే రెండు.. మూడు రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో వైఎస్సార్‌ జిల్లా రిజిస్ట్రేషన్‌ కలిగిన మోటారు బైక్‌ ఉండడంతో మృతులు వైఎస్సార్‌ జిల్లాకు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. మృతుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల లోపు ఉంటుంది. అటవీశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలున్న సమీపంలో కోడేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు చూసేందుకు ప్రజల నిత్యం ఈ ప్రాంతానికి వచ్చి జలకాలాటలు ఆడుతుంటారు. ఈ ప్రదేశం పక్కనే మృతదేహాలు పడి ఉండడం కలకలం రేపుతోంది.