బలమైన జట్టును తయారు చేయడం కష్టం

బలమైన జట్టును తయారు చేయడం కష్టం

టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లిని తొలగించి రోహిత్‌ శర్మని నియమించండం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.. ఈ క్రమంలో బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత మాజీ ఆటగాడు మదన్‌లాల్‌ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. బీసీసీఐ సెలెక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై కోహ్లి తప్పనిసరిగా విముఖత చూపి ఉంటాడని మదన్‌లాల్‌ తెలిపాడు.

“సెలెక్టర్లు దీని గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఒక వేళ కోహ్లి భారత్‌కు మంచి విజయాలు అందిస్తుంటే అతడిని ఎందుకు తొలిగించాలి..? టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్‌ ఎందుకు తప్పుకున్నాడో నేను అర్ధం చేసుకోగలను. వన్డే, టెస్ట్‌ ఫార్మాట్లపై దృష్టి సారించాడానికి మాత్రమే అతడు టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. 2023 వన్డే ప్రపంచకప్ వరకు కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగుతాడని నేను అనుకున్నాను. ఒక బలమైన జట్టును తయారు చేయడం చాలా కష్టం. కానీ ఆ జట్టును నాశనం చేయడం చాలా సులభం” అని అతడు పేర్కొన్నాడు.

ఇక వన్డే, టీ20 ఫార్మట్‌లకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్‌లు కలిగి ఉండడం గందరగోళం​ సృష్టిస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే గంగూలీ వాదనను మదన్‌లాల్‌ వ్యతిరేకించాడు. కోహ్లి టెస్ట్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు.. టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్‌గా ధోని దాదాపు రెండేళ్లు పాటు కొనసాగాడని మదన్‌లాల్‌ గుర్తు చేశాడు.

“ఎందుకు గందరగోళం ఏర్పడుతుందో నాకు అర్థం కాలేదు. ప్రతి కెప్టెన్‌కి ఒక్కో స్టైల్‌ ఉంటుంది. కాబట్టి గందరగోళం దేనికి. టెస్ట్ క్రికెట్‌కి, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు చాలా తేడా ఉంది. విరాట్, రోహిత్ జట్లను నడిపించడంలో తమదైన శైలిని కలిగి ఉన్నారు. ఎంఎస్ ధోనీ కూడా తనదైన శైలిలో జట్టును నడపించాడు. అన్నిటి కంటే అంతర్జాతీయ స్ధాయిలో ఆడూతూ రాణించడం గొప్ప విశేషం” అని మదన్‌లాల్‌ మగించాడు.