ఫ‌డ్న‌విస్ హెలికాప్ట‌ర్ ప్ర‌యాణంలో మ‌రోసారి ఆటంకం

maharashtra cm Devendra fadnavis Helicopter troubles

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నిత్యం పాల‌నా వ్య‌వ‌హారాల‌తో త‌ల‌మున‌క‌లై ఉండే రాష్ట్ర ముఖ్య‌మంత్రులు… ప్ర‌యాణ స‌మ‌యాన్ని ఆదా చేసుకునేందుకు, వీవీఐపీ హోదాలో ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ల‌లో ప్ర‌యాణిస్తుంటారు. అన్ని జాగ్ర‌త్త‌లుతీసుకోవ‌డంతో పాటు, భ‌ద్ర‌తా ప‌రంగా క్షుణ్నంగా త‌నిఖీలు చేసిన త‌రువాతే సీఎంలు హెలికాప్ట‌ర్ లు ఎక్కుతారు. అయితే ప్ర‌భుత్వ‌మూ, అధికారులు ఎంత జాగ‌రూక‌త‌తో ఉన్న‌ప్ప‌టికీ… కొన్నిసార్లు విధి వ‌క్రిస్తుంటుంది. అలాంటి దుర‌దృష్ట‌క‌ర‌సంద‌ర్భాల్లోనే ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి దోర్జీ ఖండూ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదాల్లో చ‌నిపోయారు. వారికే కాదు… దేశంలోని ఇత‌ర ముఖ్య‌మంత్రుల‌కు కూడా అప్పుడ‌ప్పుడు హెలికాప్ట‌ర్ లో త‌లెత్తే సాంకేతిక లోపాలు, ఇత‌ర కార‌ణాల‌తో చిన్న చిన్న ప్ర‌మాదాలు ఎదుర‌వుతున్నాయి. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్ కు ఇలా వ‌రుస‌గా హెలికాప్ట‌ర్ రూపంలో ప్ర‌మాదాలు వెంటాడుతున్నాయి.

CM Devendra Fadnavis Helicopter Troubles

ఈ ఏడాది మే 25న ఫ‌డ్న‌విస్ ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ కు పెను ప్ర‌మాదం త‌ప్పింది. లాతూరు జిల్లాలో గాల్లోకి లేచిన కొద్దిసేప‌టికే హెలికాప్ట‌ర్ క్రాషై విద్యుత్ తీగ‌ల‌పై ప‌డింది. ఈ ప్ర‌మాదం నుంచి ఫ‌డ్న‌విస్ సుర‌క్షితంగా త‌ప్పించుకున్నారు. ఇది జ‌రిగి రెండు నెల‌లైనా గ‌డ‌వ‌క‌ముందే జులై 7న ఆయ‌నకు హెలికాప్ట‌ర్ రెక్క‌లు త‌గ‌ల‌బోయాయి. భ‌ద్ర‌తాసిబ్బంది చొర‌వ‌తో ఆ ప్ర‌మాదంనుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. తాజాగా మ‌రోసారి ఆయ‌న ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ కు ఇబ్బంది ఎదుర‌యింది. నాసిక్ నుంచి బ‌య‌లుదేరిన హెలికాప్ట‌ర్ ను కొద్దిసేప‌టికే బ‌ల‌వంతంగా దించేయాల్సి వ‌చ్చింది. హెలికాప్ట‌ర్ లో ప‌రిమితికి మించి బ‌రువు ఉండ‌డంతో ప్రయాణం సాధ్యం కాలేదు. దీంతో భ‌ద్ర‌తా సిబ్బంది ఓ వ్య‌క్తిని, కొంత ల‌గేజీని దించివేశారు. అనంత‌రం హెలికాప్ట‌ర్ య‌థావిధిగా ఔరంగాబాద్ కు బ‌య‌లుదేరింది. అయితే భ‌ద్ర‌తాసిబ్బంది తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సీఎం స్థాయి వ్య‌క్తి ప్ర‌యాణించేట‌ప్ప‌డు హెలికాప్ట‌ర్ బ‌య‌లు దేరే ముందే బ‌రువు త‌దిత‌ర విష‌యాల‌ను ప‌రిశీలించ‌క‌పోవ‌డాన్ని ప‌లువురు త‌ప్పుప‌డుతున్నారు.