విషం నూరిపోస్తున్న పాకిస్తాన్‌ స్కూల్స్‌

విషం నూరిపోస్తున్న పాకిస్తాన్‌ స్కూల్స్‌

పాకిస్తాన్‌లోని విద్యార్థులకు నోబెల్‌ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్‌ జాయ్‌పై ఆ దేశ ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోషియేషన్‌ విషం నూరిపోస్తోంది. ఇందుకోసం ఆ సంఘం ఒక ప్రత్యేక డాక్యుమెంటరీని విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం సోమవారం విద్యా కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌ను లక్ష్యంగా చేసుకుని యువతలో ఆమె పట్ల వ్యతిరేకత కలగడానికి ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. మతం, పెళ్లి, పశ్చిమ దేశాల అజెండా అమలు విషయంలో ఆమె తీరును దీనిలో ప్రస్తావించారు. కాగా, మలాలా సోమవారం 24వ పుట్టిన రోజు జరుపుకొన్నారు.

ఇక సోమవారం పాకిస్థాన్‌లోని గుల్‌బెర్గ్‌లోని కార్యాలయంలో ఆల్‌ పాకిస్తాన్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ ఫెడరేషన్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. దీని అధ్యక్షుడు కసీఫ్‌ మిర్జా మాట్లాడుతూ ‘‘ ఐ యామ్‌ నాట్‌ మలాలా డాక్యుమెంటరీ చిత్రంలో.. ఆమెకు మతం, పెళ్లిపై ఉన్న వివాదాస్పద అభిప్రాయాలు, పశ్చిమ దేశాల అజెండా అమలు వంటి అంశాలను వెల్లడించారు. యువతలో ఆమె అసలు రూపాన్ని బహిర్గతం చేయడమే మా లక్ష్యం. మహిళల హక్కుల కోసం పోరాడుతుందనుకొని యువత ఆమె పట్ల ఆకర్షితులు కాకుండా చేయడమే మా ఉద్దేశం. మా దేశంలోని 2,00,000 ప్రైవేట్ పాఠశాలల్లోని 20 మిలియన్ల విద్యార్థులకు దీనిని చూపిస్తాం’’ అని పేర్కొన్నారు.