యువతిని మోసం చేసిన యువకుడు

యువతిని మోసం చేసిన యువకుడు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. ఈ ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలోని బోడుప్పల్ శ్రీసాయిరాం నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జనగాం జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన ప్రణీతకు గత ఐదు సంవత్సరాలుగా ప్రశాంత్‌తో పరిచయం ఉంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో తనను పెళ్లిచేసుకుంటానని నమ్మించి యువతిని ఎనిమిది నెలల గర్భవతిని చేశాడు.

అయితే ప్రియురాలిని మోసం చేసి శ్రీజ అనే మరో అమ్మాయిని ప్రశాంత్‌ ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని ప్రియురాలు గట్టిగా నిలదీయడంతో ఈనెల మూడున మిర్యాలగూడ తీసుకువెళ్ళి ఒక గదిలో పెళ్ళి చేసుకున్నాడు. అంతలోనే తనకు చెప్పాపెట్టకుండా మిర్యాలగూడ నుంచి ఇంటికి వచ్చేశాడని, ఇదేంటని ప్రశ్నిస్తే అతని తల్లి దండ్రులు ప్రశాంత్‌ను దాచిపెట్టి తమను ఏం చేసుకుంటారో చేసుకో పొమ్మంటున్నారని వాపోయింది. తనకు న్యాయం చేసే వరకూ ఊరుకునేది లేదని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను పీఎస్‌కు తరలించారు.