వేముల రోహిత్ ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌తీకారంగా మావోయిస్టుల భారీ కుట్ర‌

Maoists Plan To Attack On HCU Vice Chancellor In Revenge Of Vemula Rohith Suicide

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి నామ‌మాత్రమే అనుకుంటున్న త‌రుణంలో ఈ నెల ప్రారంభంలో తెలంగాణ‌, ఛత్తీస్ గ‌ఢ్ స‌రిహ‌ద్దుల్లో జరిగిన ఎన్ కౌంట‌ర్ ఒక్క‌సారి ఉలిక్కిప‌డేలా చేసింది. మావోయిస్టులు మ‌ళ్లీ బ‌లం పెంచుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న స‌మాచారంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఎక్క‌డిక‌క్క‌డ త‌నిఖీలు నిర్వ‌హిస్తూ అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఇవాళ పోలీసులు మావోయిస్టుల భారీ కుట్ర‌ను భ‌గ్నం చేశారు. రెండేళ్ల క్రితం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విద్యార్థి వేముల రోహిత్ ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌తీకారంగా  హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ వైస్ చాన్స‌ల‌ర్ అప్పారావు హ‌త్య‌కు మావోయిస్టులు కుట్ర పన్నారు. 
పోలీసులు భ‌ద్రాచ‌లం-చ‌ర్ల రోడ్డుపై వాహ‌నాలు త‌నిఖీ చేస్తుండ‌గా…చంద‌న్ మిశ్రా, పృథ్వీరాజ్ అనే ఇద్ద‌రు యువ‌కులు పోలీసుల‌కు చిక్కారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించ‌గా…అప్పారావు హ‌త్య‌కు కుట్ర పన్నిన విష‌యం వెలుగుచూసింది. చంద్ర‌న్న ద‌ళం సెంట్ర‌ల్ క‌మిటీ స‌భ్యుడు హ‌రిభూష‌ణ్ ఆదేశాల‌తో అప్పారావు హ‌త్య‌కు మావోయిస్టులు ప‌థ‌క ర‌చ‌న చేశార‌ని పృథ్వీరాజ్, చంద‌న్ మిశ్రా చెప్పారు. కోల్ క‌తాకు చెందిన చంద‌న్ మిశ్రా హెచ్ సీయూలో ఎంఏ చ‌దువుతున్నాడు.
పృథ్వీరాజ్ కృష్ణా జిల్లా కేస‌రిప‌ల్లి వాసి అని, వారిద్ద‌రికీ యూనివ‌ర్శిటీలోనే స్నేహం ఏర్ప‌డింద‌ని తూర్పుగోదావ‌రి జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ చెప్పారు. ఇద్ద‌రినీ భ‌ద్రాచ‌లం స‌రిహ‌ద్దుల్లో అదుపులోకి తీసుకున్నామ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై వీసీ అప్పారావు స్పందించారు. త‌న‌కు ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి బెదిరింపులూ రాలేద‌ని, త‌న‌ను చంప‌డానికి ఎవ‌రు కుట్రచేశారో కూడా తెలియ‌ద‌ని, పోలీసులు కూడా త‌న‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం హెచ్ సీయూ చాలా ప్ర‌శాంతంగా ఉంద‌న్నారు. రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌నలో వీసీ అప్పారావుపై అప్ప‌ట్లో విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశాయి. ఆయ‌న్ను స‌స్పెండ్ చేయాల‌ని పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టాయి.