కరోనాతో పెళ్లి ఆగిందని.. పెద్దాయన గుండె ఆగింది

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలో కరోనా ప్రభావం మరో వ్యక్తిని బలికొంది. పెళ్లి ఆగిపోయిందని తీవ్రంగా బెంగపడిన పెళ్లుకూతురు తండ్రి మృతి చెందడం అంతటా కలకలాన్ని సృష్టిస్తోంది. అంతా బాగుంటే ఈ వారంలో పెళ్లి జరగాలి. అలాంటిది లాక్‌డౌన్ కారణంగా పెళ్లి పనులు ఆగిపోవడంతో పాటు పెళ్లి పత్రికలు పంచేందుకు తాను వైజాగ్ వచ్చి ఇరుక్కు పోయాను అనే బాధ కూడా ఆ బెంగకు కారణమైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

అయితే లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే.. కొందరు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు వాయిదా వేసుకుంటుంటే.. మరికొందరేమో కుటుంబసభ్యుల సమక్షంలో కానిచ్చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు మందసకు చెందిన వెంకటరావు అనే వ్యక్తి కూతురు పెళ్లి ఆగిపోతుందన్న బెంగతో గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. కాగా మందస మండలంలోని పిడిమందసకు చెందిన వెంకటరావు(54) వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకంలో మునిగారు.