వివాహిత దారుణ హత్య

వివాహిత దారుణ హత్య

పులివెందుల పట్టణంలోని మెయిన్‌ రోడ్డులో బుధవారం ఉదయం రిజ్వానా అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. ప్రియుడే ఆ మహిళ పాలిట కాలయముడయ్యాడు. అక్రమ సంబంధమే హత్యకు కారణమైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పులివెందుల పట్టణంలోని మెయిన్‌ రోడ్డులోని రమణారెడ్డి ఎలక్ట్రికల్‌ షాపు పై అంతస్తులో పగడిపాలెం సర్దార్, రిజ్వానా నివాసం ఉంటున్నారు. రిజ్వానా పెళ్లికాకముందే మరో వ్యక్తితో ప్రేమాయాణం కొనసాగించగా.. ఐదేళ్ల క్రితం సింహాద్రిపురానికి చెందిన పగిడిపాలెం సర్దార్‌కు ఆమెను ఇచ్చి వివాహం చేశారు.

వీరి జీవితం సజావుగా సాగింది. 3 నెలల కిందట రిజ్వానా కుమారుడితో కలిసి ప్రియుడు హర్షవర్థన్‌తో వెళ్లిపోయింది. దీనిపై అప్పట్లో భర్త సర్దార్‌ భార్య కనిపించలేదని ఫిర్యాదు చేశాడు. హర్షవర్ధన్‌ తల్లిదండ్రులు కూడా మా కుమారుడు కనిపించలేదని ఫిర్యాదు చేశాడు. అనంతపురం జిల్లా కదిరి పోలీసులు రెండు రోజుల తర్వాత హర్షవర్ధన్, రిజ్వానాలను కనిపెట్టి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. అప్పట్లో పోలీస్‌స్టేషన్‌లో పెద్ద మనుషుల సమక్షంలో రిజ్వానా తనకు భర్త కావాలని చెప్పింది. దీంతో భార్యభర్తలు పట్టణంలోని రమణారెడ్డి ఎలక్ట్రికల్‌ షాపు పైఅంతస్తులో నివసిస్తున్నారు.

వారం రోజుల క్రితం హర్షవర్ధన్‌ రిజ్వానాకు ఫోన్‌ చేసి తన వద్ద ఉండకుండా భర్త వద్ద ఉంటావా.. నిన్ను చంపేస్తానాంటూ బెదిరిస్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం సర్దార్‌ వెల్డింగ్‌ వర్క్‌కు వెళ్లాడు. రిజ్వానా తల్లితో కలిసి రమణారెడ్డి ఎలక్ట్రికల్‌ షాపులో ఉండగా హర్షవర్ధన్‌ కత్తితో పొడిచాడు. దీంతో రిజ్వానా అక్కడికక్కడే మృతి చెందింది. హర్షవర్ధన్‌ పారిపోతుండగా రమణారెడ్డి షెట్టర్‌ వేసి అతన్ని షాపులో ఉంచి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ భాస్కర్‌రెడ్డి, ఏఎస్‌ఐ చంద్రశేఖర్‌ నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రమణారెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలికి భర్త సర్దార్, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సర్దార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.