పెద్ద టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్నాడు.. అయ్యే పనేనా?

maruthi movie with allu arjun

‘ఈరోజుల్లో’ వంటి చిన్న చిత్రంతో దర్శకుడిగా మారిన మారుతి అతి తక్కువ సమయంలోనే స్టార్‌ డైరెక్టర్‌ అయ్యాడు. ‘ప్రేమ కథా చిత్రమ్‌’, ‘కొత్త జంట’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘మహానుభావుడు’ చిత్రాలతో మారుతి తన స్థాయిని అమాంతం పెంచేసుకున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య, అను ఎమాన్యూల్‌తో ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తప్పకుండా ఈ చిత్రం కూడా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. ఇక మారుతి తర్వాత టార్గెట్‌ మెగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అంటూ సమాచారం అందుతుంది.

అల్లు అర్జున్‌కు మారుతికి మద్య స్నేహం ఉంది. ఇద్దరు కూడా చదువుకునే రోజుల్లో స్నేహితులు. ఆ స్నేహంతోనే మారుతిని బన్నీ ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చాడు. సినిమాలకు ప్రమోషన్స్‌ కోసం, పీఆర్‌ఓగా వినియోగించుకున్నాడు. ఆ తర్వాత మారుతి దర్శకుడిగా మారి వరుసగా చిత్రాలు చేస్తూ సక్సెస్‌లు దక్కించుకుంటున్నాడు. ఇక చాలా కాలంగా బన్నీతో సినిమా చేయాలనే కోరికతో మారుతి ఉన్నాడు. ఆ కోరికను బన్నీ వద్ద కూడా ఉంచాడు. తప్పకుండా చేద్దాం, మంచి కథతో వస్తే సొంత బ్యానర్‌లోనే సినిమా చేద్దాం అంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. దాంతో శైలజ రెడ్డి తర్వాత మారుతి తన తదుపరి చిత్రాన్ని బన్నీతో చేస్తాడని తెలుస్తోంది. బన్నీతో చేయబోతున్న మూవీ సక్సెస్‌ అయితే తర్వాత టార్గెట్‌ చరణ్‌ అవుతాడని సినీ వర్గాల వారు అంటున్నారు. మరి చరణ్‌ వరకు మారుతి వెళ్లగలడా అనేది చూడాలి.