తిరుమల కొండ మీద అపచారం !

హిందువులంతా అత్యంత పవిత్రంగా భావించే తిరుమలలో అపచారం జరిగింది. తిరుమలలో మాంసం, మద్యం నిషేధంలో ఉన్నాయి. అయినా ఏదోక దారిని తిరుమలకు మాంసం మద్యం చేరుతూనే ఉన్నాయి. మద్య, మాంసాలు, పొగాకు ఉత్పత్తులపై నిషేధం ఉన్న తిరుమలలో కొందరు గుర్తు తెలియని వారు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి కోడి మాంసాన్ని తీసుకు వచ్చారు. దాన్ని రోడ్డుపై పారేయడంతో వాటిని చుసిన భక్తులు కంగుతిన్నారు. అది కూడా గరుడ పోలీసు విశ్రాంతి భవనం ముందే మాంసం పడిఉండడం మీద భక్తుల నుండి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఓ ప్లాస్టిక్‌ కవరు చిరిగి అందులో నుంచి మాంసం ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. స్థానికంగా నివాసముండే వారు ఈ మాంసాన్ని తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. దీన్ని గుర్తించిన మీడియా ప్రతినిధులు పోలీసులకు సమాచారమివ్వటంతో విషయం తెలుసుకున్న పోలీసులు, హుటాహుటిన అక్కడికి వచ్చి మాంసం ముక్కలను తీసివేయించారు. అలిపిరిలో భద్రతా తనిఖీలు నిర్లక్ష్యంగా ఉండటంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు భక్తులు అంటున్నారు.