మోక్షం కోసం ఇంత దారుణంగానా ?

తెల్లవారగానే దేశ రాజధాని ఉలిక్కిపడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. డిల్లి లోని బురారి ప్రాంతానికి వారు ఫర్నిచర్ వ్యాపరం నిర్వహిస్తుంటారు. ఉదయం 6 గంటలకే షాపు తెరిచే వారు ఏడూ దాటినా దుకాణానికి రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి ఇంటి వద్దకు వెళ్లి చూడగా 11 మంది కుటుంబ సభ్యులు ఉరి వేసుకుని కనిపించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. కొన్ని మృతదేహాలు సీలింగ్‌కు ఉరి వేసుకున్నట్టు.. మరికొన్నిమృతదేహాలు కళ్లకు గంతలుకట్టి, నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి నేలపై పడి ఉన్నాయి. ప్రతిభా దేవి అనే వృద్ధురాలి మృతదేహం మినహా తప్ప.. మిగిలిన వారి డెడ్ బాడీలు కూడా అలాగే ఉండటంతో.. దీని వెనుక తాంత్రిక పూజల కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఒకవేళ వీరిని ఎవరైనా చంపారనుకున్నా.. ఇంట్లో విలువలైన వస్తువులన్నీ అలాగే ఉన్నాయి. మహిళల ఒంటిపై ఉన్న బంగారం జోలికి కూడా పోలేదు. కాబట్టి ఈ 11మంది ఆత్మహత్యే చేసుకొని ఉంటారనే వాదన తెరపైకి వస్తోంది.

అలాగే ఇంట్లోని క్రైమ్ సీన్‌ను బట్టి కూడా పోలీసులు కూడా ఆత్మహత్యలేననే ఓ అంచనాకు వచ్చారని తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మృతదేహాలు ఉన్న ఇంట్లో సోదాలు జరిపిన అనంతరం పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఆ ఇంట్లో పోలీసులకు కొన్ని పుస్తకాల్లో క్షుద్ర పూజలు, మోక్షం పొందేందుకు ఉన్న మార్గాల గురించిన వివరాలు లభించాయి. అంతే కాకుండా ఎలా మరణిస్తే సంపూర్ణ మోక్షం లభిస్తుందన్న విషయాలు కూడా ఉన్నాయి. పుస్తకాల్లో ఉన్న ప్రకారమే మృతదేహాలు ఉండటంతో.. వీరి ఆత్మహత్యకు అదే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబంలోని ఒక వ్యక్తి అందరికీ ఆత్మహత్య చేసుకునేందుకు సాయపడి.. అనంతరం తను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ 11 మంది ఆత్మహత్యకు ముందు ఆ ఇంట్లో క్షుద్ర పూజలు జరిగినట్టు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత తెలియజేస్తామన్నారు.