జయప్రకాశ్‌ రెడ్డి మృతిపై సంతాపం తెలిపిన మోదీ

జయప్రకాశ్‌ రెడ్డి మృతిపై సంతాపం తెలిపిన మోదీ

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జయప్రకాశ్‌ రెడ్డి మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా స్పందించిన ఆయన ‘జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి.’ అంటూ ట్వీట్‌ చేశారు.

అదే విధంగా జయప్రకాశ్‌రెడ్డి మరణంపై హోంశాఖ మంత్రి అమిత్‌ షా సంతాపం వ్యక్తం చేశారు. ‘గొప్ప ప్రతిభ గల తెలుగు నటుడు జయప్రకాశ్‌ రెడ్డి గారి అకాల మరణం నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. విలక్షణ పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయం. పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన స్థానం భర్తీ చేయలేనిది. ఆయన కుటుంబానికి అభిమానులకు నా ప్రగాఢ సంతాపం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా టాలీవుడ్‌ నటుడు జయప్రకాశ్‌రెడ్డి(74) కన్నుమూసిన విషయం తెలిసిందే. గుండెపోటుతో బాత్‌రూమ్‌లో కుప్పకూలిన ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు.