ఇండియా రానున్న ట్రంప్… మోడీకే ఎరుక

Modi invites Donald Trump for Republic day in 2019

ప్రస్తుత మోడీ ప్రభుత్వం తమ పదవీ కాలంలో చివరిసారిగా జరపనున్న రాబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా జరపాలని యోచిస్తోంది. అందుకే 2019 జనవరి 26న నిర్వహించే భారత గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌‌ను భారత ప్రభుత్వం ఆహ్వానించినట్లు తెలిసింది. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఆహ్వానం పంపగా భారత్ చేసిన విజ్ఞప్తికి వైట్‌హౌస్‌ సానుకూలంగా స్పందించిందని సమాచారం. భారత్‌ ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చే గణతంత్ర వేడుకలకు ట్రంప్ ముఖ్య అతిథిగా హాజరైతే ఈ వేడుకకు హాజరైన రెండో అమెరికా అధ్యక్షుడు ఆయనే అవుతారు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా వచ్చారు.
ప్రతి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఒక విదేశీ అతిథిని ఆహ్వానించడం భారతీయ సంప్రదాయంగా ఉంది.

1950లో జరిగిన తొలి గణతంత్ర దినోత్సవం నుంచి కూడా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. 1950లో జరిగిన తొలి గణతంత్ర వేడుకలకు అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నోను భారతీయ ప్రభుత్వం ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. కాగా ఇంతవరకు అత్యధికంగా ఈ అవకాశం ఫ్రాన్స్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లకే లభించాయి. 1961లో ఇంగ్లాండ్‌ రాణి ఎలిజబెత్‌ ఈ వేడుకలకు హాజరయ్యారు. అయితే ఇప్పుడు అమెరికా ఇతర దేశాల ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు పెంచడం, ఇరాన్‌ నుంచి చమురు దిగుమతిని ఆపేయాలని భారత్‌ను అమెరికా హెచ్చరిస్తున్న సమయంలో ట్రంప్‌ను ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారతీయుల అమెరికా ఉపాధి అవకాశాలకు గండికొట్టడంతో పాటు పరోక్షంగా భారత్‌పై పలు ఆంక్షలు విధిస్తున్న ట్రంప్‌తో భారత్ మరింత స్నేహాన్ని కోరుకోవడం వెనక మతలబు మోడీజీ కే ఎరుక.