అతనే కాబోయే ముఖ్య‌మంత్రి… ప్ర‌ధాని ధీమా

Modi Speech in Karnataka election Campaign

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

క‌ర్నాట‌క ఎన్నిక‌ల ప్రచారం జోరందుకోంది. ఎన్నిక‌ల తేదీ స‌మీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ ప్రచారం ఉధృతంచేశాయి. ప్ర‌ధాన‌మంత్రి మోడీ తొలిసారి క‌ర్నాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఐదురోజుల ప్ర‌చార‌ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మైసూర్ లోని చామ‌రాజ్ న‌గ‌ర్ జిల్లా సంతెమార‌హ‌ళ్లిలో ఏర్పాటుచేసిన బ‌హిరంగ‌స‌భ‌లో ప్ర‌సంగించిన ప్ర‌ధాని కాంగ్రెస్ పైనా, ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీపైనా నిప్పులు చెరిగారు. రాహుల్ త‌న‌కో స‌వాల్ విసిరార‌ని, పార్ల‌మెంట్ లో రాహుల్ 15 నిమిషాలు మాట్లాడితే తాను స‌భ‌లో కూర్చోలేన‌ని అన్నార‌ని, రాహుల్ స‌రిగ్గానే చెప్పార‌ని, ఆయ‌న‌లాంటి గొప్ప‌వారిముందు త‌మ‌లాంటి ప‌నిమంతులు కూర్చోలేర‌ని మోడీ ఎద్దేవా చేశారు. త‌న‌ సంగ‌తి వ‌దిలేసి రాహుల్ ఒక ప‌నిచేయాల‌ని ప్ర‌ధాని స‌వాల్ విసిరారు.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా హిందీ లేదా ఇంగ్లీష్ లేదా త‌న త‌ల్లి మాతృభాష ఇటాలియ‌న్ లో 15 నిమిషాలు క‌ర్నాట‌కలో కాంగ్రెస్ సాధించిన విజ‌యాల‌ను కాగితం చూడ‌కుండా మాట్లాడాల‌ని స‌వాల్ చేశారు. రాహుల్ అలా మాట్లాడితే ఆయ‌న మాట‌ల్లో ఉన్న ద‌మ్ము ఏంటో క‌ర్నాట‌క ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తార‌ని మోడీ వ్యాఖ్యానించారు. 2005 లో కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఉన్న సోనియాగాంధీ 2009లోపు రాజీవ్ గాంధీ గ్రామీణ్ విద్యుతీక‌ర‌ణ్ యోజ‌న్ కింద దేశంలోని విద్యుత్ లేని గ్రామాల‌న్నింటికీ విద్యుత్ అందిస్తామ‌ని ఇచ్చిన హామీని 2014 వ‌ర‌కు కూడా ఎందుకు నెర‌వేర్చ‌లేక‌పోయారో… సోనియాగానీ, రాహుల్ గానీ చెప్ప‌గ‌ల‌రా అని మోడీ నిల‌దీశారు. 1947 నుంచి అత్య‌ధిక సంవ‌త్స‌రాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 18 వేల గ్రామాల‌కు విద్యుత్ అందించ‌లేక‌పోయింద‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు దేశ‌మంతా విద్యుత్ ఉంద‌న్నారు. కాంగ్రెస్ హామీల‌న్నీ మాట‌ల‌కే ప‌రిమిత‌మ‌ని, బీజేపీది చేసి చూపించే త‌త్వ‌మ‌ని, స్వ‌త‌హాగా బీజేపీకి ప్ర‌జ‌ల‌మాదిరిగానే ఓపిక ఎక్కువ‌ని, ప్ర‌జ‌ల‌కు కూడా ఈ ల‌క్ష‌ణ‌మంటేనే ఇష్ట‌మ‌ని మోడీ చెప్పారు.

ఇప్పుడు కూడా మీ మాట‌లు ప్ర‌జ‌లు న‌మ్ముతార‌ని ఎలా అనుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోయి ఉన్నార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ మెరుపులు సృష్టిస్తుంద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో క‌ర్నాట‌క ప్ర‌జ‌ల‌కున్న ఏకైక ఆశ య‌డ్యూరప్ప మాత్ర‌మేన‌ని, క‌ర్నాట‌కకు కాబోయే ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్పేన‌ని మోడీ విశ్వాసం వ్య‌క్తంచేశారు.