ఢిల్లీ జట్టు ఎప్పుడు పటిష్టంగానే ఉంది

ఢిల్లీ జట్టు ఎప్పుడు పటిష్టంగానే ఉంది

ఇప్పటివరకు 12 ఐపీఎల్‌ సీజన్లు జరగ్గా ఢిల్లీ జట్టుకు మాత్రం ఐపీఎల్‌ టైటిల్‌ మాత్రం కలగానే మిగిలిపోయింది. 2008లో ప్రారంభమైన మొదటి సీజన్‌లో ఫ్లేఆఫ్స్‌ మినహాయిస్తే.. 2018 వరకు ఢిల్లీ జట్టు ప్రదర్శన లీగ్‌లో అంతంతమాత్రంగానే ఉండేది. మధ్యలో 2012లో మరొకసారి ఫ్లేఆఫ్స్‌కు అర్హత సాధించినా అది నామమాత్రంగానే మిగిలింది.

కానీ 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకొని శ్రెయాస్‌ అయ్యర్‌ సారధ్యంలో ఏడేళ్ల తర్వాత ఫ్లేఆఫ్స్‌కు చేరింది. శిఖర్‌ ధవన్‌, రిషభ్‌ పంత్‌, పృథ్వీ షా, సందీప్‌ లమిచ్చానే వంటి ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తున్న ఢిల్లీ జట్టులో ఈ ఏడాది రవిచంద్రన్‌, అజింక్యా రహానేల చేరికతో మరింత బలంగా కనిపిస్తుంది.

తాజాగా ఢిల్లీ పేసర్‌ మోహిత్‌ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈసారి ఎలాగైనా కప్‌ కొడుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ‘ ఇప్పటివరకు ఉన్న ఫలితాలను పక్కనపెడితే.. ఢిల్లీ జట్టు ఎప్పుడు పటిష్టంగానే ఉంది. గతంలో వేరే జట్లకు ఆడినప్పుడు ప్రత్యర్థిగా ఢిల్లీ జట్టును దగ్గర్నుంచి చూశాను. ఇప్పడు మాత్రం ఢిల్లీని తీసిపారేసి జట్టుగా చూడొద్దు.. ఎందుకంటే ఢిల్లీ యువకులతో నిండిన బలమైన జట్టుగా తయారైంది.

ఈ రెండేళ్లలో మరింత బలంగా తయారయ్యాం. దీంతో పాటు ఢిల్లీ జట్టుకు రికీ పాంటింగ్‌ ప్రధాన కోచ్‌గా రావడం.. రేయాన్‌ హారీస్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఉండడం.. ఈ సీజన్‌లో మమ్మల్ని ఫేవరెట్‌గా మార్చాయి.’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ సెప్టెంబర్‌ 20న కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో మొదటిమ్యాచ్‌లో తలపడనుంది.