ఔటర్‌కు మరింత శోభ

More Charm to the outer

గ్రేటర్ మణిహారమైన ఔటర్ రింగు రోడ్డులో పచ్చని అందాలు కనువిందు చేస్తున్నాయి. 158 కిలోమీటర్ల మేర రహదారిలో ఎటూ చూసిన ఆహ్లాదాన్ని పంచే మొక్కలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం అధికారులు ఔటర్‌లో పచ్చదనం పెంపునకు అత్యధిక ప్రాధాన్యనిస్తున్నారు. ఔటర్ పైకి చేరిన సగటు ప్రయాణికుడికి ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రయాణం సాగేలా అర్బన్‌ఫారెస్ట్రీ విభాగం ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఔటర్ మెయిన్ క్యారేజీ వే, సెంట్రల్ మీడియన్, హెడ్జ్ భాగం, ఎంసీడబ్ల్యూ, ఇంటర్‌చేంజ్‌లు, సర్వీసు రోడ్ల వెంటడి దాదాపుగా నాటిన 60 లక్షల మొక్కలతో గ్రీనరి శోభ సంతరించుకుంది. పొగడ, గన్నేరు, దురంద, అకాలిఫా, ఇనేర్మి, ఫడరన్ తదితర మొక్కలను నాటి పచ్చని తోరణంగా ఔటర్ మార్గాన్ని మార్చారు. ఇందులో భాగంగానే ఐదో విడతలో ఔటర్ పచ్చదనానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. దాదాపుగా 6 లక్షలకు పైగా ఈ సారి నాటనున్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటడంతో పాటు సర్వీస్ రోడ్లు, ఇంటర్‌చేంజ్‌ల వద్ద మొక్కలను నాటనున్నాయి. ఈ సారి రేడియల్ రోడ్ల వెంబడి పెద్ద ఎత్తున ఎవెన్యూ ఫ్లాంటేషన్ చేపట్టనున్నారు.

ఔటర్‌లో వాయు, ధ్వని కాలుష్యం ఎక్కువే. ఈ మొక్కలు పెంచడం వల్ల ఈ రెంటింటిని నియంత్రిస్తాయని, దీంతో పాటు చెట్లు, మొక్కలు ఉన్న చోట భూమి క్రమక్షయానికి గురయ్యే అవకాశం తక్కువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఔటర్‌కు మరింత అందంగా కనబర్చే చర్యల్లో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అర్బన్‌ఫారెస్ట్రీ విభాగం డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. నిర్వహణ విషయంలోనూ 158 కిలోమీటర్ల రహదారిని విభాగాలుగా విభజించి నిరంతర పచ్చదనం పెంపునకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గచ్చిబౌలి-శంషాబాద్ మాదిరిగా అన్ని విభాగాల్లో కనువిందు చేసే రీతిలో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం జరుగుతుందన్నారు.