మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబేను అరెస్టు చేసిన పోలీసులు

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబేను అరెస్టు చేసిన పోలీసులు

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబేను ఎట్ట‌కేల‌కు పోలీసులు అరెస్టు చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యినిలో గురువారం అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. కాన్పూర్‌ సమీపంలోని బిక్రూ గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను బ‌లి తీసుకున్న ఘ‌ట‌న‌లో వికాస్ దూబే ప్ర‌ధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు అత‌ని న‌లుగురి అనుచ‌రుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌స్ట‌ర్‌కు అత్యంత స‌న్నిహితుడు, అత‌ని బాడీగార్డు అమ‌ర్ దూబేను పోలీసులు మంగ‌ళ‌వారం ఎన్‌కౌంట‌ర్‌లో కాల్చి చంపేశారు. ఇత‌నిపై 25 వేల రూపాయ‌ల రివార్డు ఉంది. వికాస్ దూబేకు స‌న్నిహితంగా ఉండే మ‌రో ఇద్ద‌రిని పోలీసులు గురువారం హ‌త‌మార్చారు. ప్ర‌భాత్ మిశ్రా, భ‌వ‌న్ శుక్లా పోలీసుల క‌స్ట‌డీ నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌‌త్నించ‌గా ఎన్‌కౌంటర్‌ చేసిన‌ట్లు తెలిపారు.

దీంతో ఇప్ప‌టివ‌ర‌కు అత‌ని ముగ్గురు అనుచ‌రులు మ‌ర‌ణించారు. ఇక‌ హ‌ర్యానాలోని ఫ‌రీదాబాద్‌లో ఓ హోట‌ల్‌లో వికాస్ దూబే ఉన్నాడ‌ని మంగ‌ళ‌వారం పోలీసుల‌కు స‌మాచారం రాగా వారు అక్క‌డికి చేరుకునేస‌రికి ప‌రారయ్యాడు. తాజాగా అత‌డు నోయిడాలో ఓ ఆటోలో వెళ్తున్న‌ట్లు పోలీసులకు ఓ వ్య‌క్తి స‌మాచారం అందించాడు. దీంతో నోయిడాలో అత‌ని కోసం పోలీసులు విస్తృత గాలింపు చేప‌ట్టారు. అనంత‌రం వికాస్ దూబే ఉజ్జ‌యినిలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడ‌ని తెలుసుకున్న‌ పోలీసులు ఈసారి అత‌డు పారిపోవ‌డానికి వీలులేకుండా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించారు. ముప్పేట దాడి చేసి అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.