శవంపై పాప… లే అమ్మా.. మనూరొచ్చింది.. వెళ్దాం..

కరోనా మహమ్మరి. లాక్ డౌన్ విధించడంతో ఏ ఒక్కరూ ఎటూ వెళ్లలేని.. బయటకెళ్లి ఎలాంటి పనీ చేయలేని పరిస్థితి. ఈ కరోనా కాలంలో రెక్కాడితే గాని.. డొక్కాడని బడుగు జీవులు బ్రతుకులు చాలా దుర్భరంగా మారాయి. లాక్‌డౌన్‌తో వలస కార్మికుల జీవితాలు ఆవిరై పోతున్నాయి. కొందరు తిండి లేక ఆకలితో అలమటిస్తుంటే.. మరికొందరు కన్నుమూస్తున్నారు. అసలే ఎండకాలం… దీంతో ఆకలికి నీరసించి పోతున్నారు చాలా మంది వడదెబ్బకు గురై మరణిస్తున్నారు.

తాజాగా గుజరాత్ లో జరిగిన ఓ ఘటన హృదయాన్ని కలచి వేస్తుంది. ఓ తల్లి ఆకలితో అలమటించి.. గొంతు తడి ఆరపోయి.. చివరికి నీరసించి కన్నుమూసింది. ఆమె తన పసిబిడ్డను ఒంటరి చేసి వెళ్లిపోయింది. దాంతో ఆ  అమాయక పాలబుగ్గల పసిపాప.. ప్రాణాలు విడిచిన అమ్మను లేయమ్మా…లే.. ఊరొచ్చింది వెళ్దామంటూ వాపోతున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. అమ్మపై ఉన్న దుప్పటిని తీస్తూ.. లే అమ్మా అంటూ అటు ఇటు చూస్తోన్న ఘటన ఆ ప్రాంత జనాన్ని దహించి వేస్తుంది. సరిగ్గా మాటలు రాని ఆ చిన్నారి ఏడుపుకు ఆ ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది.

కాగా బీహార్‌కు చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం గుజరాత్‌కు వలస వెళ్లింది. లాక్‌డౌన్‌తో ఆమెకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో సొంతూరికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైల్లో శనివారం గుజరాత్‌ నుంచి బయల్దేరింది. సోమవారం బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని రైల్వే స్టేషన్‌కు శ్రామిక్‌ రైలు చేరుకుంది. అయితే ఆ రైల్లో నుంచి ప్రాణాన్ని ఒడిసి పట్టుకొని దిగిన ఆ మహిళ ప్లాట్‌ఫాం పైనే కుప్పకూలి పోయింది. అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కాగా ఆహారం, నీరు లేకనే ఆమె నీరసించి పోయిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. దీంతో ఆమె రైల్లోనే నీరసంగా ఉందని.. రైలు దిగగానే చనిపోయిందని వెల్లడించారు. ఆ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ చిన్నారిని పోలీసులు బంధువులకు అప్పగించారు.