సాక్ష్యాల్ని తారుమారు చేస్తున్న ముంబయి పోలీసులు

సాక్ష్యాల్ని తారుమారు చేస్తున్న ముంబయి పోలీసులు

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసు రోజు రోజుకూ జఠిలమవుతోంది. ముంబయి పోలీసులేమో.. విచారణ ఆరంభ దశలోనే సుశాంత్‌ది ఆత్మహత్య అని ప్రాథమికంగా నిర్ధారించేశారు. ఆ తర్వాత రెండు నెలల పాటు ఎంతోమందిని విచారించి.. అనేక కోణాల్లో పరిశోధన సాగించి.. చివరికి సుశాంత్‌ది ఆత్మహత్యగానే ప్రకటించారు.

కానీ సుశాంత్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రం సుశాంత్ మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ సొంత రాష్ట్రం బీహార్‌లో సుశాంత్ మద్దతుదారుల డిమాండ్ మేరకు అక్కడి ప్రభుత్వం సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. కేంద్రం అందుకు అంగీకరించింది. సీబీఐ విచారణ మొదలైంది కూడా.

మరోవైపు బీహార్ పోలీసులు కూడా తమ వంతుగా ఈ కేసును విచారించే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే వాళ్లు ముంబయికి వచ్చి విచారణ జరిపే ప్రయత్నం చేస్తుండగా.. ముంబయి పోలీసులకు అది ఎంతమాత్రం నచ్చట్లేదని సమాచారం. వారిని అడ్డుకునే, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారట.

ఈ కేసులో మొదట్నుంచి ముంబయి పోలీసులపై అనేక అనుమానాలు, ఆరోపణలు వినిపిస్తన్నాయి. వాళ్లు కేసును నీరుగార్చే, సాక్ష్యాల్ని తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ పోలీసులు రంగంలోకి దిగడం వారికి నచ్చట్లేదని.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. తమ పరిధిలో ఉన్న కేసులో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని బెదిరిస్తున్నారని.. దీంతో బీహార్ పోలీసులు మారు వేషాల్లో తిరుగుతూ విచారణ జరుపుతున్నారని.. సుశాంత్ సన్నిహితులతో పాటు అనేకమందిని కలుస్తున్నారని బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేస్తోంది.