ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య

ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య

ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురిని అత్యంత కిరాతకంగా హత్యచేశారు. కామ్‌దరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పహర్తోలి గ్రామంలో ఈ ఘటన సంభవించింది. తండ్రి, తల్లి, కుమారుడు, కోడలు, ఓ చిన్నారిని పదునైన ఆయుధంతో పొడిచి చంపడం ఈ ప్రాంతంలో కలకలం రేగింది. మంగళవారం రాత్రి ఈ ఘోరం చోటుచేసుకోగా.. స్థానికులు బుధవారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యల గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

కుటుంబం వివాదాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కుటుంబం ఆర్ధికంగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు స్థానికులు తెలిపారు. మృతులను నికుదీన్ తోప్నో (60), భార్య జోస్పినా (55), వారి కుమారుడు విన్సెంట్ (35), కోడలు సైల్వంతీ (30), వీరి ఐదేళ్ల కుమారుడు అశ్విన్‌గా గుర్తించారు. ఈ హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వీరంతా ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలోనూ పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.

కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితులు కోసం గాలిస్తున్నారు. డాగ్ స్వ్యాడ్‌ను రంగంలోకి దింపి, ఘటనా స్థలిలో ఆధారాలను సేకరిస్తున్నారు. ఇంటిలో మృతదేహాలు ఒక్కో చోట పడి ఉండటంతో హత్యగానే భావిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు తెలిపారు. వీరి శరీరాలపై ఉన్న గాయాలను బట్టి గొడ్డలితో దాడిచేసిన చంపిపట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఎలా మృతిచెందారో తెలుస్తుందని పేర్కొన్నారు.