మ‌ళ్లీ పార్టీ మారుతున్న నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి

Nagam Janardhan Reddy Quit BJP and Joins in Congress
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్నిక‌లకు ఇంకా ఏడాది స‌మ‌యమే ఉండ‌డటంతో తెలంగాణ‌లో వ‌ల‌స‌లు జోరందుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ‌లో అధికార ప‌క్షం టీఆర్ ఎస్ కు దీటుగా బ‌దులిస్తున్న కాంగ్రెస్ లో చేరేందుకు నేత‌లు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇప్ప‌టికే రేవంత్ రెడ్డి టీడీపీలో కీల‌క స్థానాన్ని వ‌దులుకుని కాంగ్రెస్ లో చేరి అదృష్టం ప‌రీక్షించేందుకు ఎదురుచూస్తుండ‌గా… ఇప్పుడు నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి వంతు వ‌చ్చింది. 2013లో బీజేపీలో చేరిన నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి ఇప్పుడు ఆపార్టీని వీడుతున్నారు. రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం కాంగ్రెస్ లో చేరాల‌ని నాగం నిర్ణ‌యించుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో క‌లిసి రెండు రోజుల క్రితం నాగం ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని క‌లిసివ‌చ్చార‌ని తెలుస్తోంది. నాగం చేరిక‌ను రాహుల్ స్వాగ‌తించిన‌ట్టు స‌మాచారం. నాగం రాక‌తో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో కాంగ్రెస్ బ‌లోపేత‌మవుతుంద‌ని భావిస్తున్నారు.

ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో అంత క్రియాశీల‌కంగా ఉన్న‌ట్టు క‌నిపించ‌క‌పోయిన‌ప్ప‌టికీ… ఒక‌ప్పుడు నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి టీడీపీలో అత్యంత కీల‌క‌నేత‌ల్లో ఒక‌రు. ఉస్మానియా మెడిక‌ల్ కళాశాల నుంచి డాక్ట‌ర్ ప‌ట్టా పొందిన నాగం, టీడీపీతో రాజ‌కీయ జీవితం ప్రారంభించారు. అనంత‌రం ఆ పార్టీలో కీల‌క‌నేత‌గా ఎదిగారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. అనేక శాఖ‌ల‌కు మంత్రిగానూ ప‌నిచేశారు. 2009 త‌ర్వాత తెలంగాణ ఉద్య‌మం ఉధృత‌రూపు దాల్చిన‌స‌మ‌యంలో ఉస్మానియా యూనివ‌ర్శిటీకి వెళ్లిన నాగం జ‌నార్ధ‌న్ రెడ్డిపై అక్క‌డి విద్యార్థులు దాడిచేయ‌డం నాగం రాజ‌కీయ జీవితాన్ని మ‌లుపుతిప్పింది. ఆ ఘ‌ట‌న స‌మ‌యంలో టీడీపీ అధ్య‌క్షునిగా చంద్ర‌బాబు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఓయూ విద్యార్థ‌ల తీరును తీవ్రంగా ఖండించారు. అయితే త‌ర్వాతి కాలంలో నాగం… చంద్ర‌బాబుకు దూరంగా జ‌రిగారు.

టీడీపీలో ఉండ‌డం వ‌ల్లే త‌న‌పై దాడిజ‌రిగింద‌ని, అదే ఇత‌ర పార్టీల్లో ఉంటే త‌న‌కు ప్ర‌జాద‌ర‌ణ బాగుండేద‌న్న అభిప్రాయానికి వ‌చ్చిన నాగం… పార్టీపైనా, చంద్ర‌బాబుపైనా బ‌హిరంగ విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టారు. టీడీపీ నుంచి వెళ్లిపోవాల‌న్న ఉద్దేశంతోనే ఆయ‌న ఇలా పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డ్డారు. కొన్నాళ్లు నాగం విమ‌ర్శ‌ల‌ను చూసీచూడ‌కుండా వ‌దిలేసిన చంద్ర‌బాబు ఆయ‌న తీరు శృతిమించ‌డంతో 2011లో పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. అనంత‌రం ప్ర‌త్యేక రాష్ట్రం సాధ‌నే ల‌క్ష్యంగా నాగం తెలంగాణ న‌గారా స్థాపించారు. 2012 ఉప ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీచేసి గెలుపొందారు. అయితే త‌న పార్టీని మాత్రం విజ‌యవంతంగా కొన‌సాగించ‌లేక‌పోయారు. తెలంగాణ ఉద్య‌మం చివ‌రి ద‌శ‌కు చేరిన వేళ 2013, జూన్ 3న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్ప‌టినుంచి బీజేపీలోనే ఉన్న నాగం, మారిన రాజ‌కీయ‌ప‌రిస్థితుల నేప‌థ్యంలో కాంగ్రెస్ లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మొత్తానికి టీడీపీని వీడిన త‌ర్వాత నాగం రాజ‌కీయ ప‌య‌నంలో ఏర్ప‌డ్డ అనిశ్చితి..ఇప్ప‌టికైనా తొల‌గిపోతుందేమో చూడాలి.