డైరెక్ట్‌ ఓటీటీకి నాని సినిమా

డైరెక్ట్‌ ఓటీటీకి నాని సినిమా

కరోనా సమయంలో నేచురల్‌ స్టార్‌ నాని నటించిన ‘వి, టక్‌ జగదీశ్‌’ చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. థియేటర్లో రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమాలు మహమ్మారి వల్ల ఓటీటీలో విడదల చేయాల్సి వచ్చింది. అయితే దీనిపై నాని, నాని ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ మాత్రం థియేటర్లోకి వచ్చింది. ఇక నాని మరో చిత్రం ఒకటి నేరుగా ఓటీటీలో రిలీజ్‌ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాని ప్రోడక్షన్‌లో ఆయన సోదరి దీప్తి దర్శకత్వం వహించిన చిత్రం ‘మీట్‌ క్యూట్‌’. నాని స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నాడట.

ఆంథాలజీ సినిమాగా రూపొందిన ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లక్స్‌ సొంతం చేసుకున్నట్లు సమాచారం. 5 విభిన్న కథానాల నేపథ్యంలో సాగే ఈ సినిమా బాహుబలి కట్టప్ప సత్యరాజ్‌, శివ కందుకూరి, దీక్షిత్‌ శెట్టి, రూహాని శర్మ, అదా శర్మ, వర్ష బొల్లమ్మలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీ ఓటీటీలో విడుదల చేస్తేనే బాగుంటుందని భావించి నాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే మీట్‌ క్యూట్‌ నేరుగా నెట్‌ఫ్లక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం. కానీ, దీనిపై ఇంతవరకు స్పష్టత లేదు. అయితే నెట్‌ఫ్లిక్స్‌ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనుందని సినీ వర్గాల నుంచి సమాచారం.