అతి విశ్వాసం చూపుతున్న నాని

నానిని తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం చేసిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. అష్టాచెమ్మ చిత్రంతో నానిని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి ఆ తర్వాత పలు చిత్రాలను తెరకెక్కించి ఆకట్టుకోలేక పోయాడు. అయితే నానితో చాలా సంవత్సరాల తర్వాత చేసిన ‘జెంటిల్‌మన్‌’ చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది. నాని ద్విపాత్రాభినయం చేసిన ఆ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే ఇంద్రగంటి ఇప్పటి వరకు భారీ కమర్షియల్‌ సక్సెస్‌ను మాత్రం దక్కించుకోలేక పోయాడు. తాజాగా విడుదలైన సమ్మోహనం చిత్రం పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకున్నప్పటికి కలెక్షన్స్‌ మాత్రం పెద్దగా రాబట్టడంలో విఫలం అయ్యింది.

నాని ప్రస్తుతం ఉన్న స్థాయికి ఆయనతో స్టార్‌ డైరెక్టర్స్‌ కూడా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే నాని మాత్రం మరోసారి తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడితోనే సినిమా చేయాలని భావిస్తున్నాడు. అందుకోసం మరో కథను సిద్దం చేయాల్సిందిగా మోహన్‌ కృష్ణ ఇంద్రగంటికి నాని సూచించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌కు హోస్టింగ్‌ చేస్తూనే వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. ఇప్పటికే నాగార్జునతో చేస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం కాకుండా రెండు మూడు చిత్రాలకు కమిట్‌ అయిన నాని తాజాగా ఇంద్రగంటి దర్శకత్వంలో కూడా ఒక చిత్రాన్ని చేసేందుకు ముందుకు రావడం జరిగింది. దర్శకుడు ఇంద్రగంటితో సినిమాను చేసేందుకు నాని చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఇంద్రగంటికి సక్సెస్‌ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నాని మరోసారి ఆయన దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. విభిన్న కథలతో ఇంద్రగంటి వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా నానితో కూడా ఒక మంచి సబ్జెక్ట్‌తో చిత్రాన్ని చేస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది.