National Politics: అభ్యంతరకర వీడియోలకు చెక్.. యూట్యూబ్ ఇండియాకు సమన్లు

National Politics: Check for objectionable videos.. Summons to YouTube India
National Politics: Check for objectionable videos.. Summons to YouTube India

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ లో కొన్ని ఛానళ్లు.. తల్లులు, కుమారులకు సంబంధించి అసభ్యకర వీడియోలను పోస్ట్ చేస్తుండటంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై యూట్యూబ్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. జనవరి 15న ఆయా ఛానళ్ల జాబితాతో ఆ సంస్థ ప్రతినిధి తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు భారత్లోని యూట్యూబ్ పబ్లిక్ పాలసీ హెడ్ మీరా ఛాట్కు.. కమిషన్ లేఖ రాసింది. ‘‘ఇలాంటి వీడియోలు చిన్నారుల భద్రత, శ్రేయస్సుకు హానీ కలిగించే ప్రమాదం ఉంది. వీటిని మైనర్లు కూడా వీక్షించేందుకు అనుమతించడం మరింత ఆందోళనకరం’’ అని కమిషన్ లేఖలో పేర్కొంది. అసభ్యకర కంటెంట్ను తమ మాధ్యమం నుంచి తొలగించేందుకు ఎలాంటి మెకానిజం వినియోగిస్తున్నారో చెప్పాలని యూట్యూబ్ను ఆదేశించింది. సమన్లకు స్పందించకపోతే అరెస్టును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

దీనిపై కమిషన్ చీఫ్ ప్రియాంక్ కనూంగో మాట్లాడుతూ.. ‘‘తల్లులు, యుక్తవయసు కుమారుల మధ్య అసభ్యకర సన్నివేశాలతో కొన్ని ఛానళ్లు వీడియోలను విడుదల చేస్తున్నాయి. ఇవి పోక్సో చట్టం ఉల్లంఘన కిందకు వస్తాయి. ఇలాంటి వీడియోలతో వ్యాపారం చేయడం .. అశ్లీల దృశ్యాలను అమ్మడంలాంటిదే. దీనిపై యూట్యూబ్ చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిని జైలుకు పంపించాలి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.