అప్పుడు విజ‌య‌శాంతి… ఇప్పుడు న‌య‌న‌తార‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
Nayanathara-Karthavyam-Movi

గ్లామ‌ర్ హీరోయిన్ గా ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించిన న‌య‌న‌తార ఇప్పుడు మాత్రం క‌థా ప్రాధాన్య‌మున్న చిత్రాల్లో న‌టిస్తూ మంచిన‌టిగా నిరూపించుకుంటోంది. అందుకే త‌మిళంలో ఎంత‌మంది హీరోయిన్లున్నా న‌య‌న‌తార‌కున్న క్రేజ్ వేరు. ఈ క్రేజ్ తోనే ఆమె కోసం ర‌చ‌యిత‌లు కొత్త క‌థ‌లు రాస్తున్నారు. అలా ఆమెను వ‌రించిన అవ‌కాశ‌మే ఆరాం. త‌మిళంలో భారీ విజ‌యం సాధించిన ఆరాంలో క‌లెక్ట‌ర్ గా న‌య‌న‌తార న‌ట‌న విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. న‌య‌న‌తార కూడా ఈ చిత్రాన్ని ఎంతో ప్ర‌త్యేకంగా భావించింది. సినిమాలో న‌టించడం వ‌ర‌కే త‌న ప‌నిగా భావిస్తూ… ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండే న‌య‌న‌తార‌… ఆరాం సినిమాకు మాత్రం త‌న వ్య‌వ‌హార‌శైలికి భిన్నంగా ప్ర‌మోష‌న్ లో పాల్గొంది. ఓ థియేట‌ర్ లో అభిమానుల మ‌ధ్య కూర్చుని ఆరాం వీక్షించింది. గోపీ నైనార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆరాం… న‌య‌న‌తార న‌ట‌నా ప్ర‌తిభ‌కు అద్దం ప‌ట్టింద‌ని త‌మిళ ప్రేక్ష‌కులు చెప్పుకున్నారు. దీంతో ఈ సినిమాను తెలుగులోకి డ‌బ్ చేస్తున్నారు శ‌ర‌త్ మ‌రార్.

న‌య‌న‌తార‌కు తెలుగులోనూ బానే క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తో పాటు… ఆరాంకు వ‌చ్చిన పాజిటివ్ టాక్..అన్ని ప్రాంతాల‌కు క‌నెక్ట‌య్యే క‌థ‌కావ‌డంతో క‌ర్త‌వ్యం పేరుతో ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తున్నాడు శ‌ర‌త్ మ‌రార్. క‌ర్త‌వ్యం టీజ‌ర్ ను కొద్దిసేప‌టి క్రితం రిలీజ్ చేశారు. ప్ర‌జ‌ల‌కు ఏది అవ‌స‌ర‌మో అదే చ‌ట్ట‌మ‌వ్వాలి గానీ… చ‌ట్టాన్ని ముందే త‌యారుచేసి దాన్ని ప్ర‌జ‌ల మీద రుద్ద‌కూడ‌దు అని టీజ‌ర్ లో న‌య‌న‌తార చెబుతున్న డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. ఒక‌ప్పుడు లేడీసూప‌ర్ స్టార్ గా పేరుపొందిన విజ‌య‌శాంతికి క‌ర్త‌వ్యం సినిమా ఎంత పేరు తెచ్చిందో… ఇప్పుటి లేడీ సూప‌ర్ స్టార్ అయిన న‌య‌న‌తార‌కు ఈ సినిమా అంత పేరు తెస్తుంద‌ని… చిత్ర‌యూనిట్ చెబుతోంది.