అప్పుడు అమ్మలో జీరో ఇప్పుడు కొడుకులో హీరో కనపడ్డారు.

NCP Chief Sharad Pawar has come out in support of Rahul Gandhi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాజకీయాల్లో అవకాశవాదం కొత్త కాకపోయినా దిగ్గజ నేతలు సైతం మూలాలనే మార్చే ప్రయత్నం చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవర్ తాజా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వానికే మచ్చ తెచ్చేలా వున్నాయి. ఈ మరాఠా వీరుడు కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం కొనసాగి సోనియా గాంధీ నాయకత్వాన్ని తప్పుబడుతూ కొత్త పార్టీ పెట్టారు. ఆయన పెట్టిన ఎన్సీపీ కాంగ్రెస్ తో కలిసే ఎన్నికల ప్రయాణం, ప్రభుత్వాల్లో భాగస్వామ్యం పొందినప్పటికీ అప్పట్లో ఆయన సంధించిన ప్రశ్నలు దేశంలో చాలా మందిని ఆలోచింపచేశాయి. ప్రధాని పీఠం దక్కదన్న దుగ్ధతో పవర్ సోనియా నాయకత్వాన్ని ప్రశ్నించారని అప్పట్లో కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. అయితే అప్పటిదాకా వివాదాలకు దూరంగా వుండే పి. ఏ . సంగ్మా, తారిఖ్ అహ్మద్ లాంటి నేతల మద్దతుతో ఎన్సీపీ ఏర్పాటు చేసిన శరద్ పవార్ సోనియా విదేశీయత, కాంగ్రెస్ లో వారసత్వ రాజకీయాల్ని నిలదీశారు. ఈ దేశం గురించి ఏమి తెలుసని ఆమె నాయకత్వానికి ఓకే చెప్పాలని ఎదురు ప్రశ్నించారు. ఆమె సామర్ధ్యం సున్నా గా లెక్కగట్టినప్పటికీ రెండు సార్లు సోనియా కనుసన్నల్లో నడిచిన యూపీఏ సర్కార్ లో భాగస్వామి అయ్యారు. అయినా సిద్ధాంత ప్రాతిపదికన ఆయన యూపీఏ కి మద్దతు ఇచ్చారు అని సరిపెట్టుకున్నారు ప్రజలు.

rahul-gandhi

ఓ వైపు మహారాష్ట్రలో బీజేపీ కన్నుగీట్లకు రెస్పాండ్ అవుతూనే తాజాగా రాహుల్ గాంధీని శరద్ పవార్ నెత్తిన పెట్టుకున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. కొన్నాళ్లుగా మారుతున్న రాహుల్ ఇమేజ్ చూసి ప్రధాని మోడీ భయపడుతున్నాడు అంటూ పవార్ అనడంలో లోగుట్టు ఏమై ఉంటుందా అని రాజకీయ పరిశీలకులు మెదడు బద్దలు కొట్టుకుంటున్నారు. సోనియా విషయంలో నాడు పవార్ లేవనెత్తిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవే ప్రశ్నలు రాహుల్ కి కూడా వర్తిస్తాయి. అప్పట్లో సోనియా రాజకీయాలకు కొత్త. రాహుల్ ఇప్పటికే ఎన్నో వైఫల్యాల్లో భాగస్వామి.అయినా రాహుల్ లో పవార్ కి హీరో కనిపిస్తున్నాడు. ఆయన వారసత్వ రాజకీయం పవార్ కంటికి కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు రాహుల్ లో హీరో చూస్తున్న శరద్ పవార్ గతాన్ని మర్చిపోయినంత తేలిగ్గా మహారాష్ట్ర ప్రజలు మర్చిపోరు. అయినా అవసరాల కోసం అభిప్రాయాలు మార్చుకోవడం నేతలకు కొత్త కాదు. వారిని భరించడం జనానికి అంతకన్నా కొత్త కాదు.

sharad-pawar