కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై విమర్శలు

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై విమర్శలు

ఐపీఎల్‌-2021 రెండో దశలో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై విమర్శలు తారాస్థాయికి చేరాయి. కేకేఆర్‌తో మ్యాచ్‌లో కెప్టెన్సీ పరంగానే కాకుండా బ్యాటింగ్‌లోనూ దారుణంగా విఫలమైన కోహ్లిపై పేరు చెప్పడినికి ఇష్టపడని ఓ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరో రెండు, మూడు మ్యాచ్‌ల్లో కోహ్లి చెత్త ప్రదర్శన ఇలాగే కొనసాగితే.. అతను తప్పుకోవడం కాదు.. జట్టు యాజమాన్యమే అతన్ని తప్పించే ఆస్కారముందంటూ వ్యాఖ్యానించాడు.

గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ దినేశ్ కార్తీక్‌ను, సన్‌రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్‌ను మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తొలగించిన విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. కోహ్లి ప్రదర్శన ఇలాగే కొనసాగితే మాత్రం ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా, ఐపీఎల్‌-2021 రెండో దశ ప్రారంభానికి ముందు కోహ్లి ఓ సంచలన ప్రకటన చేశాడు. ఈ ఐపీఎల్‌ సీజ‌నే ఆర్సీబీ కెప్టెన్‌గా త‌న‌కు ఆఖరిద‌ని వెల్లడించాడు. అంతకు కొద్దిరోజుల ముందే టీమిండియా టీ20 బాధ్యతల(టీ20 ప్రపంచకప్‌ తర్వాత) నుంచి కూడా తప్పుకోనున్నట్లు కోహ్లి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.