త్వరలోనే కెప్టెన్‌గా బాధ్యతలు

త్వరలోనే కెప్టెన్‌గా బాధ్యతలు

గోల్డ్‌కోస్ట్‌ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా మహిళల చేతిలో ఓటమి పాలైన భారత్‌ సిరీస్‌ను చేజార్చుకుంది. అంతక ముందు జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఓటమి పాలై ఘోర పరాభవాన్ని భారత్‌ మూటకట్టుకుంది. ఈ క్రమంలో జట్టు హెడ్‌ కోచ్‌ రమేశ్ పవార్ కీలక వాఖ్యలు చేశారు. భారత జట్టు స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన త్వరలోనే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటుందని పవార్ తెలిపారు. టెస్టులో స్మృతి మంధాన బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉందని, ఏదో ఒకరోజు ఆమె జట్టును నడిపిస్తుందని ఆయన అన్నారు.

“మేము ఆమెను భారత జట్టు సారధిగా చూడాలని అనుకుంటున్నాము. ‘ఆమె ప్రస్తుతం జట్టు వైస్ కెప్టెన్‌గా ఉంది. ఏదో ఒక సమయంలో ఆమె ఈ జట్టుకు నాయకత్వం వహిస్తుంది. ఏ ఫార్మాట్‌కు స్మృతి కెప్టెన్‌గా ఎంపిక అవుతోందో నాకు తెలియదు. బీసీసీఐ, సెలెక్టర్లు, నేను తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తాము’ అని పవార్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగినన రెండో వన్డే మ్యాచ్‌లో 86 పరుగులు చేసిన స్మృతి మంధాన, పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో 127 పరుగులు చేసి డ్రాగా ముగియడంలో కీలక పాత్ర పోషించింది. ఆఖరి టీ20 మ్యాచ్‌లోను 52 పరుగులు చేసి రాణించింది.