రేపు నూతన ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యుల బాధ్యతల స్వీకరణ

New MPPs and MPTCs adoption of responsibilities from tomorrow

మండలాల్లో పాత పాలకవర్గాల పదవీకాలం జూలై 3తో ముగియనుండటంతో.. కొత్త మండల పరిషత్‌ల మొదటి సమావేశ తేదీ (అప్పాయింటెడ్ డే)ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే ఖరారు చేసింది. జూలై 4న (కొన్ని జిల్లాల్లోని ఎంపీపీలు మినహా) రాష్ట్రంలోని ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్టు ఎస్‌ఈసీ స్పష్టంచేసింది. అదేరోజున తొలి సమావేశం నిర్వహించనున్నారు. ఆ తేదీనుంచే వీరి పదవీకాలం మొదలై.. ఐదేండ్లు కొనసాగనున్నది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ఎంపీపీలు, ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారం, నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల ఎంపీపీలు, ఎంపీటీసీలు మినహాయించి.. మిగిలిన జిల్లాలోని ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు గురువారం బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా సమావేశం కానున్నారు. కొత్త ఎంపీపీలతోపాటు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం అధికారికంగా మొదలువుతున్నది. ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు తమ స్థానాల్లో కూర్చోడానికి ముందే ఎంపీటీసీ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ఎంపీపీలు, మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారం, నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల ఎంపీపీలు ఆగస్టు 6న పదవుల్లోకి రానున్నారు. రాష్ట్రంలో మొత్తం 539 మండలాలకు గాను.. ములుగు జిల్లా మంగపేటలో ఎన్నికలు జరుగలేదు. మిగిలిన 538 మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తిచేశారు.