ముదురుతున్న అసోం–మిజోరం సరిహద్దు వివాదం

ముదురుతున్న అసోం–మిజోరం సరిహద్దు వివాదం

అసోం–మిజోరం సరిహద్దు వివాదానికి సంబంధించి చెలరేగిన హింసలో ఐదుగురు పోలీసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరు రాష్ట్రాల సరిహద్దు వివాదంలో కొత్త ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై మిజోరాంలో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. సీఎంతో పాటు మరో నలుగురు పోలీసు ఉన్నతాధికారులపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్అ నురాగ్ అగర్వాల్, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ కచార్ దేవోజ్యోతి ముఖర్జీ, కచార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రకాంత్ నింబాల్కర్‌, ధోలై పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆఫీసర్ ఉద్దీన్, నీహ్లయా మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది.

ఈ సందర్భంగా ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘‘సరిహద్దు పట్టణానికి సమీపంలో మిజోరాం, అసోం పోలీసు బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల తరువాత సోమవారం సాయంత్రం రాష్ట్ర పోలీసులు వైరంగ్టే పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కచార్ డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లి, కచార్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సన్నీడియో చౌదరిపై కూడా అదే అభియోగాల కింద కేసులు నమోదు చేశాం’’ అని తెలిపారు. వీరితో పాటు మరో 200 మంది అసోం పోలీసు సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు సదరు అధికారి పేర్కొన్నారు.మిజోరాం సరిహద్దులోని అసోం జిల్లాలు కచర్‌, హైలకండీలో అక్టోబర్ 2020 నుంచి ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి.

ఈ ప్రాంతంలో తరచుగా ఇళ్లు తగలబెట్టడం, భూమిని ఆక్రమించుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండు ఈశాన్య రాష్ట్రాలు 164.6 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. అసోంలోని కచార్, హైలకండీ, కరీంగంజ్ జిల్లాలు.. మిజోరంలోని కొలాసిబ్, మమిత్, ఐజ్వాల్ సరిహద్దును పంచుకుంటున్నాయి.ప్రాదేశిక సరిహద్దుకు సంబంధించి రెండు రాష్ట్రాలు భిన్నమైన వివరణలు వెల్లడిస్తున్నాయి . 1875 లో గిరిజనులను బాహ్య ప్రభావం నుంచి కాపాడటానికి రూపొందించిన ఒక అంతర్గత రేఖ వెంబడి తమ సరిహద్దు ఉందని మిజోరాం విశ్వసిస్తుండగా.. అస్సాం 1930 లలో చేసిన జిల్లా సరిహద్దు ద్వారా వెళుతుంది.